Telangana: తెలంగాణలో అత్యల్ప స్థాయిలో వయోవృద్ధుల జీవన నాణ్యత

Telangana: క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ ఫర్‌ ఎల్డర్లీ ఇండెక్స్‌ నివేదిక * గుజరాత్‌లోనూ పెద్ద వయస్కుల జీవన నాణ్యత అంతంతే

Update: 2021-08-12 03:05 GMT

తెలంగాణలో అత్యల్ప స్థాయిలో వయోవృద్ధుల జీవన నాణ్యత (ఫైల్ ఇమేజ్)

Telangana: వయోవృద్ధుల జీవన నాణ్యత దేశం మొత్తం మీద తెలంగాణలోనే అత్యల్ప స్థాయిలో ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌ సంస్థ రూపొందించిన క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ ఫర్‌ ఎల్డర్లీ ఇండెక్స్‌ను విడుదల చేసింది. రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల్లో పెద్ద వయస్కుల జీవన స్థితిగతులు చాలా మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా 50 లక్షలకుపైగా వృద్ధుల జనాభా ఉన్న రాష్ట్రాలను ఒక విభాగంలోకి, అంతకంటే తక్కువ మంది వృద్ధులున్న రాష్ట్రాలను మరో కేటగిరిలోకి చేర్చింది. 50 లక్షల మందికిపైగా వృద్ధులున్న విభాగంలోని తెలంగాణలో పెద్ద వయస్కుల జీవన నాణ్యతను గుర్తించే ప్రయత్నం చేసింది. ఆర్థిక పరిస్థితి, సాంఘిక శ్రేయస్సు, వైద్య సౌకర్యాలు, ఆదాయ భద్రత అనే నాలుగు ప్రధాన అంశాలు ప్రాతిపదికగా వారి జీవన నాణ్యత దేశంలోనే అత్యల్ప స్థాయిలో ఉందనే అంచనాకు వచ్చింది.

రాజస్థాన్‌, మహారాష్ట్ర, బిహార్‌లలో వృద్ధుల జీవన నాణ్యత మెరుగ్గా ఉందని అధ్యయనంలో తేలింది. దీంతో 50 లక్షల మందికిపైగా వృద్ధులున్న రాష్ట్రాల విభాగంలో ఇవి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. 50 లక్షల్లోపు వృద్ధుల జనాభా ఉన్న విభాగంలో హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా టాప్‌-3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇదే విభాగంలోని గుజరాత్‌లో పెద్ద వయస్కుల జీవన నాణ్యత అత్యల్ప స్థాయిలో ఉందని నివేదిక పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్‌ మొదటి స్థానంలో నిలవగా, జమ్మూకశ్మీర్‌ చివరి స్థానంలో నిలిచింది. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరం మొదటి స్థానంలో, అరుణాచల్‌ప్రదేశ్‌ చివరి స్థానంలో నిలిచాయి. వృద్ధుల జీవన నాణ్యతతో ముడిపడిన వివిధ విభాగాలకు 'ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌' జాతీయ స్థాయిలో స్కోరును కూడా కేటాయించింది. వైద్య సౌకర్యాలకు 66.97 స్కోరును, సాంఘిక శ్రేయస్సుకు 62.34, ఆర్థిక శ్రేయస్సుకు 44.7, ఆదాయ భద్రతకు 33.03 స్కోరును ఇచ్చింది. సగానికిపైగా రాష్ట్రాల్లో వృద్ధుల ఆర్థిక శ్రేయస్సు, ఆదాయ భద్రత అంతంత మాత్రంగానే ఉందని నివేదిక తెలిపింది. 

Tags:    

Similar News