SSC Hall Tickets : తెలంగాణ టెన్త్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్..నేరుగా వాట్సాప్‌కే పదో తరగతి హాల్‌టికెట్లు
తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు నేడు విడుదలవుతున్నాయి. విద్యార్థులు వెబ్‌సైట్, వాట్సాప్ లేదా స్కూళ్ల ద్వారా వీటిని పొందవచ్చు. మార్చి 14 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Telangana SSC Hall Tickets 2026
SSC Hall Tickets : తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ అదిరిపోయే తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి టెన్త్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు నేడు (గురువారం, మార్చి 5) విడుదల కానున్నాయి. అయితే ఈసారి విద్యార్థులు హాల్‌టికెట్ల కోసం స్కూళ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, విద్యాశాఖ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఏకంగా మూడు రకాలుగా హాల్‌టికెట్లను అందుబాటులోకి తెస్తోంది. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా, నేరుగా మీ మొబైల్ ఫోన్‌కే హాల్‌టికెట్ వచ్చేలా ఏర్పాట్లు చేసింది.
సాధారణంగా ప్రతి ఏటా కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల బకాయిల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెడుతుంటాయి. ఫీజు కడితేనే హాల్‌టికెట్ ఇస్తామని పట్టుబట్టడం వల్ల పేద విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బోర్డు ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టింది. స్కూళ్లు ఇవ్వకపోయినా సరే, విద్యార్థులు నేరుగా బోర్డు వెబ్‌సైట్ నుంచి లేదా తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్ ద్వారా హాల్‌టికెట్ పొందేలా వెసులుబాటు కల్పించింది. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లను పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 5,28,248 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి. విద్యార్థులు సెకండరీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్ పొందవచ్చు. ఇవి కాకుండా ఇప్పటికే ప్రింటెడ్ హాల్‌టికెట్లను కూడా జిల్లాల వారీగా స్కూళ్లకు పంపిణీ చేశారు. ఏపీలో కూడా ఇప్పటికే హాల్‌టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. అక్కడ మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒకే సమయంలో పరీక్షలు జరుగుతుండటంతో విద్యాశాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి.