Telangana Rising Global Summit 2025: లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా – రెండు రోజులపాటు జరగనున్న కార్యక్రమాల షెడ్యూల్
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ఏర్పాట్లు అట్టహాసంగా పూర్తయ్యాయి.
Telangana Rising Global Summit 2025: లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా – రెండు రోజులపాటు జరగనున్న కార్యక్రమాల షెడ్యూల్
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ఏర్పాట్లు అట్టహాసంగా పూర్తయ్యాయి. శోభాయమానంగా అలంకరించిన 100 ఎకరాల విస్తీర్ణంలో రెండురోజుల పాటు ఈ గ్లోబల్ ఈవెంట్ జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రముఖులు, ఆరు ఖండాల 44 దేశాలనుంచి వచ్చిన 154 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తుండటం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా లక్షల కోట్ల పెట్టుబడుల కోసం పలు ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం ఉంది.
గవర్నర్ ప్రారంభోత్సవం – సీఎం కీలక ప్రసంగం
సోమవారం (డిసెంబర్ 8) మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ సమ్మిట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రారంభ వేడుకకు దేశ–విదేశాల నుంచి సుమారు 2,000 మంది అతిథులు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. రాష్ట్ర పాలనలో రెండేళ్ల ప్రగతి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సపోర్ట్, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రత్యేకతలపై ఆయన వివరణ ఇస్తారు.
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
సీఎం ప్రసంగం తర్వాత అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నాలుగు వేర్వేరు హాళ్లలో సమాంతరంగా ప్యానెల్ చర్చలు జరుగుతాయి. తొలి రోజు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత–నైపుణ్యాలు, మహిళా అభివృద్ధి, పారిశ్రామిక ఎదుగుదల, సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
రెండో రోజు ముఖ్య కార్యక్రమాలు
డిసెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పలు పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు పాల్గొనే చర్చలు జరగనున్నాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, మౌలిక వసతులు, పరిశోధన–అభివృద్ధి, స్వదేశీ–విదేశీ పెట్టుబడుల పెంపు వంటి అంశాలు ప్రధాన చర్చావిషయాలుగా ఉంటాయి. మొత్తం 27 విభాగాలపై సెషన్లు నిర్వహించేందుకు ప్రత్యేకంగా హాళ్లు సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను సీఎం ఆవిష్కరించనున్నారు.
సాంస్కృతిక వేడుకలు – టూరిజం ప్రచారం
సమ్మిట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించనుంది. రాష్ట్ర ప్రత్యేకతలైన కొమ్ము కోయ, బంజారా, ఒగ్గు డోలు, పేరిణీనాట్యం, కోలాటం, గుస్సాడీ, బోనాల వంటి సాంప్రదాయ నృత్యాలు కూడా సందర్శకులను అలరించనున్నాయి.
అదే విధంగా, నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ థీమ్ పార్క్ ‘బుద్ధవనం’కు ప్రతినిధులను తీసుకెళ్లేందుకు టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత నెల రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు ఏర్పాట్లను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వస్తున్నారు.