Telangana Global Summit 2025: నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు ప్రారంభం
Telangana Global Summit 2025: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది.
Telangana Global Summit 2025: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది. డిసెంబర్ 8,9 తేదీలో జరిగే కార్యక్రమంలో రైజింగ్ తెలంగాణ - 2047లో భాగంగా విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనుంది. రాష్ట్ర ఆర్ధిక వృద్ధిరేటు 3ట్రిలియన్ లక్ష్యంగా తెలంగాణ అడుగులు వేస్తోంది. అందులో భాగమే ప్రతిష్టాత్మక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ఐసీసీసీలో వరుసగా ఈనెల 30వరకు వివిధ విభాగాల మంత్రిత్వ శాఖలో సీఎం సమీక్షలు నిర్వహించనున్నారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వరుస సమీక్షా సమావేశాలు జరపనున్నారు. సమ్మిట్‌లో ఆవిష్కరించనున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌కు.. తుది మెరుగులు దిద్దేందుకు ప్రతి విభాగంతో సీఎం స్వయంగా సమీక్షలు నిర్వహించనున్నారు. నిన్న మొదలైన సమీక్షా సమావేశాలు 30 వరకు శాఖాలవారీగా ఐసీసీసీలో జరగనున్నాయి.
నేడు లాజిస్టిక్స్, అతిథుల స్వాగతం, సదుపాయాల ఏర్పాట్లపై సమీక్ష జరగనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, ఉన్నతాధికారులు, ఆయా శాఖల అధికారులు పాల్గొంటారు. రేపు మౌలిక వసతులు, నగర అభివృద్ధి, రవాణా, సెక్యూరిటీ ఏర్పాట్లు. వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాల్గొంటారు. నవంబర్ 28 మధ్యాహ్నం 4 గంటలకు విద్య, యువజన సంక్షేమ శాఖ సమీక్ష. మంత్రులు వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి హాజరవుతారు. సాయంత్రం 6 గంటలకు టూరిజం & టెంపుల్ టూరిజంపై జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పాల్గొంటారు. నవంబర్ 29 వ్యవసాయం, సంక్షేమ శాఖలపై సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకాటి శ్రీహరి హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు జరిగే సమీక్షలో పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, అజరుద్దీన్ పాల్గొంటారు. నవంబర్ 30 ఆరోగ్య శాఖపై సమీక్షిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొననున్నారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం.. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేయడం. ఈ సమ్మిట్ రాష్ట్రం యొక్క ఆర్థిక సామర్థ్యం, భవిష్యత్ లక్ష్యాలను ప్రదర్శిస్తుంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించడం ద్వారా భవిష్యత్ విజన్ ను నిర్దేశించడంలో సహాయపడుతుంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచడం దీని ప్రధాన లక్ష్యం, దీంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ వ్యూహాత్మక అంశాలపై చర్చించనున్నారు.