కేంద్రం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించింది... పద్మ అవార్డులకు ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్లు ఇవే

Update: 2025-01-26 06:26 GMT

కేంద్రం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించింది - సీఎం రేవంత్ రెడ్డి

Padma Awards 2024: తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిని కేంద్రం అవమానించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న గొప్ప వ్యక్తుల జాబితాను పద్మ అవార్డుల కోసం సిఫార్సు చేస్తే కేంద్రం ఆ జాబితాను పట్టించుకోలేదన్నారు. పద్మ పురస్కారాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాస్తానని అన్నారు. శనివారం రాత్రి పద్మ అవార్డుల ప్రకటన తరువాత సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ నుండి ఇద్దరికి మాత్రమే పద్మ పురస్కారాలు వరించాయి. అందులో డా నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ ప్రకటించారు. మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డ్ ప్రకటించారు.

తాను గద్దర్ పేరును పద్మ విభూషణ్ పురస్కారానికి (మరణానంతరం) సిఫార్సు చేశానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రముఖ విద్యావేత్త, ఐఐటి గురుగా పేరున్న చుక్క రామయ్య పేరును పద్మ భూషణ్ పేరును సిఫార్సు చేశామన్నారు. కవి గాయకుడు, జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ పేరును పద్మభూషణ్ పురస్కరానికి పంపించినట్లు చెప్పారు. ప్రజా గాయకులు గోరటి వెంకన్న పేరును పద్మశ్రీ పురస్కారం కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. కవి, చరిత్రకారులు జయధీర్ తిరుమల రావు పేరును పద్మశ్రీ పురస్కారానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు.

Full View

అయితే, తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఈ పేర్లు ఏవీ పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం తెలంగాణ ప్రజలను అవమానించిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన వీరిని విస్మరించడం అంటే తెలంగాణ ఆత్మాభిమానాన్ని కించపరచడమే అవుతుందన్నారు. 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం తెలంగాణ నుండి కనీసం ఒక్క ఐదుగురు పేర్లను పరిగనణలోకి తీసుకోకపోవడం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. 

Tags:    

Similar News