Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో సీఎం రేవంత్ ఢీ
Revanth Reddy: తెలంగాణ రైజింగ్, ప్రజాపాలనలో భాగంగా.. పర్యటనలు, అధికారులతో సమీక్షలు, సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం రేవంత్‌రెడ్డి కొద్దిసేపు అంతా మర్చిపోయి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆటలో మునిగితేలారు.
Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో సీఎం రేవంత్ ఢీ
Revanth Reddy: తెలంగాణ రైజింగ్, ప్రజాపాలనలో భాగంగా.. పర్యటనలు, అధికారులతో సమీక్షలు, సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం రేవంత్‌రెడ్డి కొద్దిసేపు అంతా మర్చిపోయి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆటలో మునిగితేలారు. సీఎం ఏంటి..? ఆటలాడటమేంటని అనుకుంటున్నారా..? మీరు వింటుంది నిజమే..! అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో సీఎం రేవంత్‌రెడ్డి తలపడనున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నెల 13న ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ స్టేడియంలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
గోట్ ఇండియా టూర్-2025 లో భాగంగా స్టార్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న మెస్సీకి ప్రభుత్వం ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సీతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి కూడా తన టీమ్‌తో బరిలోకి దిగనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని MCHRD గ్రౌండ్‌లో సీఎం రేవంత్ కాసేపు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు. యువతతో కలిసి ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. సుమారు గంటపాటు ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన బాల్‌ను పాసింగ్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. పరుగులు తీస్తూ గోల్స్ చేసి అక్కడున్నవారిని ఆకట్టుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఫుట్‌బాల్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫుట్‌బాల్ ఆటగాడైన ఆయన.. సమయం చిక్కినప్పుడల్లా ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం గతంలో కూడా మనం చూశాం. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత ఏడాది మే 12న హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి ఫుట్‌బాల్ ఆడారు సీఎం రేవంత్‌రెడ్డి. అయితే.. ఆట మధ్యలో తన షూ పాడైపోతే వాటిని పక్కన పెట్టేసి షూ లేకుండానే సీఎం ఫుట్‌బాల్ ఆడి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. సీఎం రేవంత్‌కు ఫుట్‌బాల్ ఆట అంటే ఎంత ఇష్టమో. ఈ క్రమంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక.. సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సూపర్ సీఎం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలంగాణ రైజింగ్‌లో భాగంగా.. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నడుం బిగించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్పిరిట్‌ను హైలైట్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకునేందుకు నేరుగా ఆయనే బరిలోకి దిగుతున్నారు. ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో క్రీడాస్ఫూర్తిని పెంచడంతో పాటు, యువతను ఫుట్‌బాల్ వైపు ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇక.. ఈ మ్యాచ్‌లో మెస్సీ తన ట్రేడ్‌మార్క్ 10వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనుండగా.. ఆర్ ఆర్ 9 జెర్సీతో సీఎం రేవంత్‌రెడ్డి మైదానంలో అడుగు పెట్టబోతున్నారు.