Teenmar Mallanna: ఈటలకు చెక్‌ పెట్టాలంటే.. మల్లన్నను ఎంకరేజ్‌ చేస్తారా?

Teenmar Mallanna: తెలంగాణ బీజేపీలో తీన్మార్‌ మల్లన్న మహిమ ఎంత?

Update: 2021-12-07 07:49 GMT

Teenmar Mallanna: ఈటలకు చెక్‌ పెట్టాలంటే.. మల్లన్నను ఎంకరేజ్‌ చేస్తారా?

Teenmar Mallanna: తెలంగాణ బీజేపీలో తీన్మార్‌ మల్లన్న మహిమ ఎంత? మల్లన్న రాక ఎవరిని కలవరపెడుతోంది ఎవరికి కలసి వస్తుంది? వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచనాలు సృష్టించే ఆ వ్యక్తి కమలంలో కలవరం సృష్టించబోతున్నాడా? వరంగల్‌ పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్రంగా నిలబడి, అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన ఆయన కాషాయం క్యాంప్‌లో కుదురుగా ఉండగలరా? వచ్చే ఎన్నికల్లో తాను పట్టు సాధించిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా నిలబడుతారా? ఇంతకీ కాషాయం ఒడిలో సేద తీరి.. ప్రత్యర్థి పార్టీలకు చుక్కులు చూపిస్తానంటున్న తీన్మార్‌ తీర్థం పవర్‌ ఎంత?

తీన్మార్‌ మల్లన్న. అలియాస్‌ నవీన్‌కుమార్‌. తెలంగాణ రాజకీయాల్లో సంచనాలు సృష్టిస్తున్న వ్యక్తి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆయన మంత్రివర్గంను స్ట్రెయిట్‌గా టార్గెట్‌ చేస్తున్న తీన్మార్‌ మల్లన్న ఇప్పుడు కాషాయం క్యాంప్‌లో చేరి, సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారబోతున్నారు. ఇన్నాళ్లూ సింగిల్‌గానే బ్యాండ్‌ బజాయించిన తీన్మార్ ఇప్పుడు కమలం క్యాంప్‌లో ఉంటూ ప్రత్యర్థి నేతలతో స్టెప్పులేయిస్తానంటున్నాడు. లేటెస్ట్‌గా ట్రెండ్ సెట్టర్‌గా తనదైన ముద్ర వేసుకుంటున్నానని చెబుతున్నాడు. కలవరం పుట్టిస్తూ క్యాంప్‌లో మంటలు రేపుతూ ఆందోళనలకు కారణమతూ తానేంటో చూపిస్తానంటున్నాడు.

ఎప్పుడు తన మార్క్ వ్యాఖ్యలతో, విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే తీన్మార్‌ అరెస్టయి, బెయిల్‌ విడుదలైన తర్వాత అదే జోష్‌ కొనసాగిస్తారా? కమలం గూటిలో ఉంటూ కూడా మల్లన్న చిచ్చుపెడతారా? అన్న చర్చ పార్టీలో జోరుగా కొనసాగుతోంది. తెలంగాణలో బలపడాలని అడుగులు వేస్తున్న బీజేపీ తీన్మార్‌ మల్లన్నకు మొదట్లోనే గాలం వేసింది. పట్టభద్రుల ఎన్నికల్లో మల్లన్న వచ్చిన మెజారిటీ చూసిన కమలనాథులు కాషాయం పార్టీ నుంచి మల్లన్నకు పోటీ చేసే అవకాశం ఇస్తే బాగుండేదని పార్టీలో ఓ చర్చ కూడా జరిగింది అప్పట్లో!!

అందులో భాగంగానే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న తెలంగాణ ఉద్యమకారులను, ఆ పార్టీలోని అసంతృప్తులను ఏరికోరి మరీ ఎంచుకుంటుందట కమలం పార్టీ. ఇందులో భాగంగానే కొందరు నేతలను ఆకర్షిస్తూ వారిపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న టాక్‌ వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసుకునే యోచనలో ఉన్న ఆ పార్టీ నాయకులు ఇలాంటి పేరున్న అసంతృప్తులను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది.

తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం కేసులు పెట్టిన సందర్భంలో అతనికి బీజేపీ అండగా నిలిచింది. అయితే, మల్లన్న చేరికతో పార్టీలో వర్గ విబేధాలు ముదిరే అవకాశం ఉందన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఒకరికి చెక్‌ పెట్టాలంటే మరొకరిని ఎంకరేజ్‌ చేసే సంప్రదాయం ఉన్న కమలం పార్టీలో మల్లన్న ఎంట్రీతో ఎవరికి చెక్‌ పెట్టబోతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. మరీ ముఖ్యంగా హుజూరాబాద్‌లో సంచలన విజయం తన వ్యక్తిగతమంటూ దానికి పార్టీతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈటలకు మల్లన్నతో చెక్‌ పెట్టబోతున్నారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. బీజేపీ అంటే ఈటల అన్నట్టుగా తన విజయానికి లింకు పెట్టిన ఈటల హైప్‌ను తగ్గించాలంటే పార్టీలో తీన్మార్‌ మోగించాలని కమలనాథులు కొందరు డిసైడ్‌ అయినట్టు సమాచారం.

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మించిన ఇమేజ్‌ ఈటలకు వస్తుండటంతో తీన్మార్‌కు తీసుకువస్తేనే బెటరని కొందరు పార్టీ నేతలు పట్టుబట్టారని కూడా చర్చ జరుగుతోంది. మల్లన్నను అడ్డు పెట్టుకొని ఈటల దూకుడుకు చెక్‌ పెట్టవచ్చని నేతలు కొందరు ఆలోచిస్తున్నారట. ఏమైనా మల్లన్నను ఓ అస్త్రంలా వాడుకునేందుకు తెలంగాణ కమలం పార్టీ ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని వేస్తుందట. మరి, కమలనాథులు కల నెరవేరుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News