Shield Summit 2025 Hyderabad: షీల్డ్ 2025 సదస్సు ఉద్దేశం ఏంటి?
Shield Summit 2025 Hyderabad: షీల్డ్ 2025 సదస్సు ఉద్దేశం ఏంటి? తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్‌బీ
Shield Summit 2025 Hyderabad: షీల్డ్ 2025 సదస్సు ఉద్దేశం ఏంటి?
షీల్డ్ 2025 సదస్సు ఉద్దేశం ఏంటి?
మీ పేరుతో కొరియర్ వచ్చింది... మీరు డిజిటల్ అరెస్టయ్యారు.... మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని అరెస్టు నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ ఏదో ఒక రూపంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలకు ఎలా చెక్ పెట్టాలి? సైబర్ నేరాల నివారణకు ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? టెక్నాలజీని ఎలా వాడుకోవాలి? సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ఏం చేయాలనే దానిపై షీల్డ్ 2025 సదస్సు ఎలాంటి నిర్ణయం తీసుకొంది? సైబర్ నేరాల అదుపునకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయనుందో ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.
షీల్డ్- 2025 సదస్సు ఉద్దేశం ఏంటి?
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్‌బీ, సైబరాబాద్ పోలీస్, సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎస్ సీ ఎస్ సీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18, 19 తేదీల్లో షీల్డ్ 2025 సెమినార్ నిర్వహించారు.సైబర్ నేరాలకు పరిష్కారం కనుగొనే దిశగా ఈ రెండు రోజుల సెమినార్ నిర్వహించారు. ఇందులో దేశంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న 40 మంది నిపుణులు పాల్గొన్నారు. రెండు రోజుల్లో 15 సెషన్లలో పలు అంశాలపై చర్చించారు. మహిళలు, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాలను ఎలా నివారించాలనే దానిపై చర్చించారు. సైబర్ నేరాలు జరుగుతాయనే ప్రమాదం ఉందని పసిగడితే ఈ మోసాలను అరికట్టవచ్చు. ఈ దిశగానే రెండు రోజుల సెమినార్ లో చర్చలు జరిగాయి.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోత పాటు హెల్ప్ లైన్ ఉన్న కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఆయన గుర్తు చేశారు. సైబర్ క్రైమ్ పోర్టల్ తయారీలో తెలంగాణ పోలీసుల పాత్ర కీలకమని ఆయన అన్నారు.ఈ టెక్నాలజీని దేశంలోని పలు రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించామని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని సెక్యూర్ బిజినెస్ హబ్ గా మార్చాలని ఆయన సైబర్ నిపుణులను కోరారు.
కొత్త సెక్యూరిటీ పాలసీ
డేటా భద్రతతో పాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి అనుగుణంగా త్వరలో కొత్త సెక్యూరిటీ పాలసీని తెస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో గిగావాట్ డేటా సెంటర్ ను నెలకొల్పుతామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ద్వారా సైబర్ నిపుణులను తయారు చేస్తామని మంత్రి అన్నారు. విదేశాల నుంచి ప్రతి ఏటా 7 బిలియన్ డాలర్ల విలువైన సాఫ్ట్ వేర్లను దిగుమతి చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
సైబర్ నిపుణులకు మంచి భవిష్యత్తు
సైబర్ నేరాలకు ఎలా అడ్డుకట్ట వేయాలి.. కొత్త పద్దతులతో సవాల్ విసురుతున్న డిజిటల్ క్రైమ్ కు పరిష్కారాలపై గంటల తరబడి చర్చించారు. వ్యక్తిగత జీవితాలతో పాటు, ప్రభుత్వాలు, సంస్థలకు కూడా సైబర్ నేరగాళ్లతో ముప్పు ఉందని జాతీయ సైబర్ భద్రతా కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ మునైర్ అన్నారు. స్కూల్ స్థాయి నుంచే పిల్లలు సైబర్ సెక్యూరిటీ గురించి వివరించాలని ఆయన సూచించారు. సైబర్ నిపుణులకు భవిష్యత్తులో డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మనిషి జీవితం డిజిటల్ కనెక్టివిటీతో ముడిపడి ఉందన్నారు
సాఫ్ట్ వేర్ డిజైన్ల తయారీలో ప్రైవసీ, సెక్యూరిటీ ప్రధానమైనవి. దేశంలోని ఒక్క ఆధార్ కార్డ్ డేటా కూడా హ్యాక్ కాలేదని ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ అన్నారు. ఆధా్ డేటా హ్యాక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏఐ సహాయంతో మహిళపై లైంగిక దాడుల వీడియోలు, ఫోటోలు రూపొందిస్తున్నారని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ వ్యవస్థాపకులు భువన్ రిభు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి తక్షణమే శిక్షలు పడాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో చట్టాలను సమన్వయం చేసుకోవాలన్నారు. అంతర్జాతీయ నేరస్తుల డేటా బేస్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
తెలంగాణలో పెరిగిన సైబర్ నేరాలు
దేశంలో సైబర్ నేరాల్లో టాప్ లో ఉన్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. 2023తో పోలిస్తే 2024లో సైబర్ నేరాలు 18 శాతం పెరిగాయి. 2024 ఒక్క ఏడాదిలోనే 1 వెయ్యి 866కోట్లను బాధితులు పోగొట్టుకున్నారు. అయితే ఇందులో 350 కోట్లను సీజ్ చేశారు. 183 కోట్లను 18 వేల మంది బాధితులకు అందించారు. 2024 లో రోజుకు సగటున 316 మంది సైబర్ మోసగాళ్ల బారినపడ్డారు. సగటున బాధితులు 5.4 కోట్లు నష్టపోతున్నారని పోలీస్ అధికారుల రిపోర్టులు చెబుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయిస్ ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. షేర్ మార్కెట్, పార్ట్ టైం ఉద్యోగాలు, డిజిటల్ అరెస్టు, ఫేక్ కాల్ సెంటర్లు, క్రెడిట్ కార్డు మోసాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ఎక్కువగా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ,వరంగల్ సంగారెడ్డి లలో కేసులు నమోదయ్యాయి.
సైబర్ నేరం అంటే ఏంటి?
టెక్నాలజీని ఉపయోగించి మోసం చేయడం లేదా నేరం చేయడాన్ని సైబర్ క్రైమ్ గా పిలుస్తారు. కంప్యూటర్, ఇంటర్నెట్ లేదా ఇతర డిజిటల్ పరికరాలను ఉపయోగించి నేరం చేయడమే సైబర్ నేరంగా చెబుతారు. హ్యాకింగ్, ఫిషింగ్, మాల్ వేర్ దాడులు, రాన్సమ్ వేర్ వంటివి సైబర్ క్రైమ్ ల పరిధిలోకి వస్తాయి. ఎక్కడో ఉండి ఈ నేరం చేయవచ్చు. దీనికి సరిహద్దులు లేవు. వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపారులు, ఆర్ధిక సంస్థలు సైబర్ నేరాలతో తీవ్రంగా నష్టపోతున్నాయి. డిజిటల్ పరికరాలు, ఇంటర్నెట్ పై ఆధారపడే కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతూనే ఉంటాయి.కంప్యూటర్లలో లేదా నెట్ వర్క్ లలో అక్రమంగా చొరబడం, హ్యాకింగ్ చేయడ, ఈ మెయిల్ బాంబింగ్, సర్వీస్ ఎటాక్ ను అడ్డుకోవడం, వైరస్ లేదా వార్మ్ దాడులు,ఇంటర్నెట్ టైమ్ థెప్ట్స్ వంటివన్నీ సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయి.
సైబర్ నేరాలను నియంత్రించే చట్టాలు ఏవి?
సైబర్ నేరాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద కేసులు నమోదు చేయవచ్చు. ఐటీ సెక్షన్ 65 ప్రకారం కంప్యూటర్ డేటాను దెబ్బతీయడం నేరమే. ఒకరి పాస్ వర్డ్ ను మరొకరు దొంగతనంగా ఉపయోగించడం కూడా నేరమే. సెక్షన్ 66 ప్రకారంగా కేసు ఫైల్ చేయవచ్చు. సెక్షన్ 66 ఈ మేరకు ఇతరుల ప్రైవేట్ చిత్రాలను పబ్లిష్ చేయడం కూడా చట్ట వ్యతిరేకమే.
టెక్నాలజీని మంచి పనులకు ఉపయోగించుకోవాలి. అయితే మంచి పనుల కంటే ఎక్కువగా టెక్నాలజీని చెడు పనులకే ఉపయోగించడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఇదే సైబర్ నేరాలకు కారణమౌతోంది. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. డిజిటల్ యుగంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. సైబర్ నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి. అలా జరిగినప్పుడే మరొకరు సైబర్ నేరాలకు పాల్పడరు. ఈ దిశగానే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.