నేడు గద్దెలపైకి సమ్మక్క తల్లి

Update: 2020-02-06 05:11 GMT

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందింది వనదేవతల సమ్మక్క – సారలమ్మ జాతర. రెండేళ్ల కోసారి జరిగే తెలంగాణ కుంభమేళాలో అసలు ఘట్టం బుధవారం పూర్తయింది. కన్నెపల్లి నుంచి కోయపూజారులు సారలమ్మని తీసుకొచ్చి డప్పు చప్పుల్ల మధ్య గద్దెపై ప్రతిష్టించారు. ఇదే రోజున మరోవైపు పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును, కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి ప్రతిష్టించారు. ముగ్గురు దేవతలు గద్దెలపై కొలువు తీరడంతో జాతర ప్రాంతం అంతా సందడి నెలకొంది.

ఇక జాతరలో ఈ రోజు సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం పూజారులు చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పూజలు చేస్తారు. కుంకుమ బరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య ప్రభుత్వ లాంఛనాలతో గద్దెలపై ప్రతిష్టించనున్నారు. దీంతో జాతరలో రెండో ముఖ్యఘట్టం పూర్తవుతుంది. తల్లులు గద్దెపై కొలువు తీరడంతో జాతరలో కొత్త శోభ సంతరించుకుంటుంది. ఇక జాతరలో మూడో ముఖ్యమైన ఘట్టం వనదేవతల వనప్రవేశం. అమ్మవార్లను భక్తుల ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న అనంతరం శనివారం దేవతలు వన ప్రవేశం చేయనున్నారు. దీంతో మేడారం జాతర పూర్తవుతుంది.

ఇక పోతే ఎంతో వైభవంగా జరిగే ఈ జాతరకు తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతో వనదేవతల జాతర కాస్తా జనాలతో నిండిపోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా భక్తుల కోసం అన్ని సదుపాయాలను ఏర్పాటుచేసింది.



Tags:    

Similar News