కరీంనగర్‌లో కాషాయ కుంపటి – బండి వర్సెస్ ఈటల వర్గపోరు మళ్లీ రగిలింది
హుజురాబాద్ నియోజకవర్గం చుట్టూ కాషాయ రగడ స్థానిక ఎన్నికల్లో బీఫాం ఇష్యూనే రచ్చకు కారణమా..? గతంలో బండిపై పరోక్షంగా ఈటల ఘాటు వ్యాఖ్యలు హుజురాబాద్‌లో ప్రెస్‌మీట్ తర్వాత రాజుకున్న మంటలు
కరీంనగర్‌లో కాషాయ కుంపటి – బండి వర్సెస్ ఈటల వర్గపోరు మళ్లీ రగిలింది
తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ రగులుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం.. ఎంపీ ఈటల రాజేందర్ మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. హుజురాబాద్ పార్టీ నేతల విషయంపై మొదలైన వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. హుజురాబాద్‌లో ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఈటల మాటాల తూటాలు పేలుస్తుంటే.. బండి వర్గం అంతే ధీటుగా కౌంటర్ అటాక్ చేస్తోంది. గతంలోనూ ఈటల, బండి మధ్య పేర్లు ప్రస్తావించకుండా డైలాగ్ వార్ నడిచింది. ఓవైపు రిజర్వేషన్ల పంచాయితీ తేలక.. స్థానిక ఎన్నికలు వాయిదా పడగా.. బండి వర్సెస్ ఈటల వర్గాల తాజా పంచాయితీ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇంతకీ ఆ రెండు వర్గాల మధ్య తాజా పొలిటికల్ పంచ్‌లకు రీజనేంటి..?
కరీంనగర్ కమల దళంలో వర్గపోరు..?
కరీంనగర్ జిల్లా కాషాయ పార్టీలో వర్గపోరు మళ్లీ రగులుకుందా..? కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వర్గాల మధ్య రచ్చ మరింత హీటెక్కిందా..? నిన్న, మొన్నటి వరకు స్దానికంగా ఉండే నాయకుల్లో కనిపించిన విభేదాలు ఇప్పుడు నేరుగా ముఖ్య నాయకుల మాటలతో మరింత రంజుగా మారిపోయాయా..? తాజా పరిణామాలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్దానిక సంస్దల ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజవర్గంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇన్నేళ్లుగా హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడని ఈటల రాజేందర్.. ఈమధ్య ఉన్నట్టుండీ రావడం.. అందులోనూ బీజేపీ శ్రేణులను, తన అనుచరులను ప్రేమగా పలకరించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈటల హుజురాబాద్ నుంచి మల్కాజిగిరి మకాం మార్చడంతో.. ఆయన ఫాలోయర్స్.. అయోమయంలో పడ్డారు. కారు దిగిన ఆయన కమలదళంలో చేరడంతో.. అప్పటి వరకు ఉన్న అనుచరులకు బీజేపీలో అంతగా ప్రాధాన్యత లేదన్న వాదన లేకపోలేదు. ఈటల మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు సరే.. మా సంగతేంటంటూ ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారట. ఈటల హుజురాబాద్ రారు.. ఇక్కడి బీజేపీ నాయకులు తమను కలుపుకునిపోరు.. అంటూ వాపోతున్నారట. ఈ నేపథ్యంలో తనను నమ్ముకున్న కేడర్‌కు భరోసా ఇచ్చేందుకు ఈటల తాజాగా హుజురాబాద్ బాట పట్టారు. వరుస పర్యటనలు చేస్తూ అనుచరులకు నేనున్నానంటూ అభయం ఇస్తున్నారు.
హుజురాబాద్‌లో పర్యటించడం.. తన అనుచరులకు భరోసా ఇవ్వడం అంతా బాగానే ఉన్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థులకు బీఫామ్స్ నేనే ఇస్తానంటూ ఈటల చేసిన కామెంట్ ఇప్పుడు అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోందన్న ప్రచారం ఉంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సెగ్మెంట్‌కే వచ్చి.. కరీంనగర్ పార్లమెంట్‌లోఉండే హుజూరాబాద్‌లో పార్టీ బీఫామ్స్ నేనే ఇస్తానంటూ ఈటల అనడం రచ్చగా మారిపోయిందట. పైగా ఆ మాటలన్న ఈటలను.. బండి సంజయ్ ఈపాటికే సర్వే చేయించారు కదా.. అని జర్నలిస్టులు అడిగితే.." నేనిక్కడ ఇరవై ఐదేళ్ల నుంచి లీడర్‌ని.." అంటూ బండికి తన మార్క్ కౌంటర్ వేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కరీంనగర్ బీజేపీలో కొత్త పంచాయితీకి తెరలేపిందన్న చర్చ జోరందుకుంది.
ఈటల కామెంట్స్‌కు బండి సంజయ్ వర్గం నుంచి కౌంటర్ అటాక్ కూడా వచ్చిందట."బీఫాంలు ఇచ్చేది వ్యక్తులు కాదు.. బీజేపీ అధిష్టానం" అని స్పష్టం చేస్తోందట బండి వర్గం. గ్రూపులు కట్టి, వర్గాలు విడిపోయేవారి మాట వినే సాంప్రదాయం బీజేపీలో లేదంటూ కూడా కుండబద్దలు కొట్టారు. నిజానికి హై కోర్ట్ స్టేతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. ఆ తరవాత హుజురబాద్‌లో ఈటల చేసిన ఈ వ్యాఖ్యలు ఇలా దుమారం రేపుతున్నాయి. అంతా సిద్దమైనప్పటికీ.. ఎన్నికలు ఆగిపోవడంతో స్దానిక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బండి వర్సెస్ ఈటల వర్గాల పంచాయితీ.. కరీంనగర్ జిల్లాలో కొత్త పొలిటికల్ హీట్ పెంచిందట.
ఇదిలాఉంటే .. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడుతారో..? అనే అంశం కంటే .. ఈటల వర్గానికి బీఫాములు వస్తాయా..? లేదంటే బండి సంజయ్ వర్గానికి దక్కుతాయా..? అనే ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్నికల హడావుడికి ప్రస్తుతం బ్రేక్ పడినప్పటికీ, ఈ రెండు వర్గాల మధ్య మొదలైన రగడ.. మరింత హీట్ పెంచుతోందట. మరి హుజూరాబాద్‌లో బీజేపీ టికెట్లు తమ వారికి ఇప్పించుకుని ఈటల పైచేయి సాధిస్తారా..? లేదంటే పార్టీ కోసం పని చేసినవారికి టికెట్లు అంటూ చెబుతున్న సంజయ్ వర్గం.. పైచేయి సాధిస్తుందా..? అనేది చూడాలి. అసలు స్థానిక సంస్థల ఎన్నికల కంటే బండి వర్సెస్ ఈటల వర్గాల అంశమే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిందట.