Saddula Bathukamma 2025: తంగేడుతో ముస్తాబు.. సకల లోకాలను కాపాడిన దుర్గమ్మకు నేడు సద్దుల నివేదన!

Saddula Bathukamma 2025: పూలపండుగతో తెలంగాణ కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే.

Update: 2025-09-29 06:14 GMT

Saddula Bathukamma 2025: పూలపండుగతో తెలంగాణ కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే. తీరొక్క పువ్వులతో పేర్చే బతుకమ్మ సంబురాలతో రాష్ట్రంలో సందడి నెలకొంది. తొమ్మిది రోజులు జరిగే... బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మ గా నిలిచే బతకమ్మ పండుగలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ నేడు. చివరిరోజు సద్దుల బతుకమ్మ... సందడి అంతా ఆ రోజే కనిపిస్తుంది. హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ నేడు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. సద్దుల బతుకమ్మ ప్రత్యేకతలపై hmtv స్పెషల్ స్టోరీ.

తెలంగాణలో ఊరూవాడలు పూలవనాలుగా మారాయి. వాడవాడలా పూలపండుగ సంబరాలు జరుగుతున్నాయి. పెత్రామాస నుంచి దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ.. మహిళలు ఆడుతారు. బతుకమ్మ వేడుకల్లో ప్రతి రోజూ.. ఓ ప్రత్యేకత. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మ తల్లికి సమర్పిస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ అంటే.. ఇక ఆ సందడే వేరు. బతుకమ్మ పండుగలో భాగంగా చివరి రోజైన సద్దుల బతుకమ్మతో పండుగ ముగియనుంది. 9వ రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించే మహిళలు 9 అంతరాలుగా బతుకమ్మను పేర్చనున్నారు. తంగేడు, గునుగు, కట్ల, బంతి, చామంతి, సీతజడలు వంటి పూలతో రోడ్లు పూలవనంలా మారాయి.

ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు నేడు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో... ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ... ఏమేమి కాయెుప్పునే గౌరమ్మ... తంగేడు పువ్వోప్పునే గౌరమ్మ.. తంగేడు కాయెుప్పునే గౌరమ్మ.. అంటూ తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే వినిపిస్తున్నాయి. బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దుర్గాష్టమిగా జరుపుకొంటారు. అలసిన అమ్మవారికి ఘనమైన పాకాలు నివేదన చేస్తారు.

గ్రామీణులు సద్దుల పేరుతో పులగం, పులిహోర, చిత్రాన్నం, నువ్వులసద్ది, కొబ్బరిసద్ది, పెరుగన్నం ఇలా వివిధ రకాలైన వంటకాలు చేస్తారు. అందుకే చివరి రోజు వేడుకకు సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. మిగతా రోజులకన్నా భిన్నంగా, పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు. సాయంత్రం కాగానే పిల్లాజెల్లా అందరూ బతుకమ్మ ఆడటానికి అందంగా ముస్తాబై కదలివస్తారు. మగవాళ్లు సైతం ఈ ముచ్చటను చూసేందుకు ఉత్సాహం కనబరుస్తారు. సద్దుల బతుకమ్మ నేటి సాయంత్రంతో ముగియనుంది. బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడిలోకి చేర్చి మళ్లీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురుచూసే రోజు ఇవాళ.

ఊరంతా చెరువు కట్టకు ఊరేగింపుగా తరలివెళ్తారు. తంగేడు పూవుల్ల చందమామ.. బతుకమ్మ పోతుంది చందమామ... పోతె పోతివిగాని చందమామ... మళ్లెప్పుడొస్తావు చందమామ.. ఏడాదికోసారి చందమామ.. నువ్వొచ్చి పోవమ్మ చందమామ అంటూ తమకు బతుకునిచ్చిన పరమేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు.

Tags:    

Similar News