Revanth Reddy: మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్టీసీ ఎండీ భేటీ

Revanth Reddy: ఇప్పటికే కర్ణాటక ఉచిత ప్రయాణంపై అధికారుల ఆరా

Update: 2023-12-08 06:59 GMT

Revanth Reddy: మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్టీసీ ఎండీ భేటీ

Revanth Reddy: తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. సంస్థ ఆపరేషన్స్‌ ఈడీ మునిశేఖర్‌ నేతృత్వంలో అధికారుల బృందం హుటాహుటిన కర్ణాటకకు వెళ్లింది. అక్కడ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలవుతున్న తీరు, సంస్థపై ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయం గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్‌కు ఇప్పటికే ప్రాథమిక సమాచారం అందించారు.

మరోవైపు కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సమావేశంకానున్నారు. ముఖ్యమంత్రితో భేటీలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మార్గదర్శకాలతో కూడిన పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది. ఏఏ బస్సుల్లో మహిళలను ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ప్రయాణ పరిధి ఎంత, ప్రయాణించే వారు ఎలాంటి గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను సీఎంతో భేటీ అనంతరం ఆర్టీసీ అధికారులు ప్రకటిస్తారు.

కర్ణాటక ప్రభుత్వం ఈఏడాది జూన్‌ నెల నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతిస్తోంది. ఆ రాష్ట్రంలో సుమారు 22 వేలకు పైగా బస్సులున్నాయి. తెలంగాణలో 8వేల 571 బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటక బస్సుల్లో 55 శాతం మహిళలు, 45 శాతం పురుషులు ప్రయాణిస్తున్నారు. ఈ పథకం అమలుకు ముందు బస్సుల్లో మహిళల సంఖ్య40 నుంచి41 శాతంగా ఉండేది. పథకం అమలు తర్వాత 12నుంచి15 శాతం వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం బస్సుల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అమలుచేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర వాసులకే ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నారు.

మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏయే బస్సుల్లో అమలుచేయాలనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పథకాన్ని అమలుకానుంది. తెలంగాణ ఆర్టీసీ నిత్యం 12నుంచి13 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోంది. సగటున రోజుకు 14 కోట్ల రూపాయల రాబడి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఉంటున్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలుతో రోజుకు సుమారు నాలుగు కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

Tags:    

Similar News