SLBC: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ టెన్నెల్ 1లో ప్రమాదం కారణంగా చిక్కుకుపోయిన ఎనిమిది మందిని ఎలా బయటకు తీసుకురావాలన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వీరిలో ఇద్దరు ఇంజనీర్లు ఉండగా..ఆరుగురు కార్మికులు ఉన్నారు. వీరంతా ఎక్కడున్నారో తెలియడంలేదు. ప్రమాదం జరిగిన సొరంగం లోపల 12కిలోమీటర్ల తర్వాత మోకాళ్ల దాకా మట్టి బురద ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వీలుగా పరిస్థితులు లేవు. సొరంగం లోపలికి వెళ్లాలనుకున్న ఎస్డీఆర్ఎఫ్ టీమ్ రాత్రి దాన్ని పరిశీలించి ప్రయత్నించి విఫలమైంది. అసలు సొరంగం లోపలికి వెళ్లే అవకాశం లేదని ఆదివారం ఉదయం తెలిపింది. వారిని రక్షించేందుకు వేరే ప్లాన్ అవసరమని చెబుతోంది.
నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మళ్లీ ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తారు. నిన్న రాత్రంతా ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపారు. నిరంతరం అప్ డేట్స్ తెలుసుకున్నారు. ప్రస్తుతం టెన్నెల్ లోపల ఉన్న నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. నీటిని తొలగించినా..బురద ఎక్కువగా ఉంది. దానికి తోడు ఆక్సిజన్ ఏర్పాట్లు 12 కిలోమీటర్ల వరకు ఉంది. ఆ తర్వాత లేదు. కానీ ప్రమాదం 14కిలోమీటర్ల దగ్గర జరిగింది. అక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల చిక్కుకుపోయిన కార్మికులకు ఇది పెద్ద సమస్యగా మారింది.
శనివారం ఉదయం 9గంటలకు టన్నెల్ ఎంట్రెన్స్ నుంచి 14వ కిలోమీటర్ పాయింట్, నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద 3 మీటర్ల పై కప్పు కూలిపోయింది. ఆ సమయంలో దాదాపు 50 మంది ఇంజినీర్లు, ఆపరేటర్లు, కార్మికులు టన్నెల్ లోపల ఉన్నారు. ఆ తర్వాత 42 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. కానీ 8 మంది రాలేదు. వారంతా బోర్ మిషన్ కు అటు వైపు ఉన్నారు. వారి కోసం అప్పటి నుంచి గాలిస్తున్నా..ఎక్కడున్నారో వారిని ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావడం లేదు.