ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు అవకాశం

భారతీయులంతా తమ ఐడెంటీకోసం ఆధార్ మాత్రమే కాదు ఓటరు కార్డును కూడా ఉపయోగిస్తారు.

Update: 2019-12-18 05:16 GMT

భారతీయులంతా తమ ఐడెంటీకోసం ఆధార్ మాత్రమే కాదు ఓటరు కార్డును కూడా ఉపయోగిస్తారు. అంతే కాదు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలన్నా కూడా ఈ ఓటు ద్వారానే ఎన్నుకుంటాం. భారత దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు వినియోగించుకోవాల్సిన మొదటి హక్కు ఓటు హక్కు. ఓటు వేయాలంటే ఎన్నికల సంఘం జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

ఇదే కోణంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2020లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేర్లు లేని వారు పేర్లు నమోదు చేసుకోవాలని ప్రకటన జారీ చేసారు. 2020 జనవరి 1వ తేదీ నాటికి యువతీ యువకుల్లో 18 ఏళ్ల వయసు నిండి ఉంటే వారి పేర్లను జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.

దాంతో పాటు ఇప్పటి వరకు ఉన్న ఓటర్ జాబితాలపై ఫిర్యాదులను, అభ్యంతరాలు కూడా వచ్చే నెల 15 వరకు స్వీకరించనున్నది. జనవరి 27 నాటికి ఈ దరఖాస్తులను పరిష్కరించి ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 59 అసెంబ్లీ నియోజకవర్గాలు, 19 జిల్లాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే 2,98,64,689 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,48,56,076 మంది మహిళలు, 1,50,07,047 మంది పురుషులు, 1,566 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారన్నారు.

ఇక పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 105 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. దీంతో మొత్తం పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 34,707కి పెరిగిందని రజత్‌కుమార్‌ స్పష్టం చేసారు.  

Tags:    

Similar News