మానవత్వానికి చిరునామా.. ఈ బామ్మ.. ఎందుకో తెలుసా!?

Update: 2020-04-14 08:23 GMT

తనకు ఆస్తులూ లేవు ఉద్యోగమూ లేదు కనీసం ఉండడానికి మంచి ఇళ్లు కూడా లేదు. కానీ తిండి దొరకని పేదలకు నేనున్నాననే భరోసా ఇచ్చింది ఓ వృద్ధురాలు. ఆపదలో ఆదుకోవాలన్న తపనతో పేదల కడుపు నింపే ప్రయత్నం చేసింది. రూపాయి పెట్టాలంటే తిరిగి మనకేం వస్తుందని ఆలోచించే మనుషులున్న లోకంలో తోటివారికి సాయం చేసి ఆదర్శంగా నిలిచింది.

దేశమంతా లాక్ డౌన్. ఎక్కడికక్కడ నిర్బంధం. రెక్కాడితే కాని డొక్కడాని పరిస్థితి ఉన్న ఎంతోమంది కరోనా దెబ్బతో అల్లాడుతున్నారు. కుటుంబాలను పోషించుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అలాంటి పేదలకు అండగా నిలిచింది ఓ వృద్దురాలు. పెద్ద మనసుతో వారి కడుపు నింపే ప్రయత్నం చేసింది.

జగిత్యాల జిల్లా కోరుట్లకి చెందిన బుచ్చమ్మ 70 ఏళ్ల వృద్ధురాలు. రోజూ చుట్టుపక్కల ఇండ్లలో బట్టలు ఉతకటం తన వృత్తి. ఇలా ఇంటింటా పని చేస్తూ ఇంటి ఖర్చులు పోనూ మిగిలిన డబ్బులను పోగేస్తూ వచ్చింది బుచ్చమ్మ. అయితే కరోనా ఎఫెక్ట్ తో పనిలేక ఇబ్బందులు పడుతోన్న తన పరిసరాల్లోని పేదలను చూసి తట్టుకోలేకపోయింది ఆ వృద్ధురాలు. వారిని ఆదుకోవాలన్న తపనతో సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

లాక్ డౌన్ తో పనిలేక ఇబ్బందులు పడుతోన్న 16 కుటుంబాలను ఏదో రకంగా ఆదుకోవాలని ఆలోచించింది బుచ్చమ్మ. తాను దాచుకున్న 25 వేల రూపాయలతో తన వంతు సాయం చేసింది. ఒక్కో కుటుంబానికి 15 వందల రూపాయల చొప్పున పంచిన ఆ వృద్ధురాలు ఉదారతను చాటుకుంది. ఆపత్కాలంలో నిస్వార్థంగా పేదలకు సాయం చేసి ప్రశంసలు అందుకుంటోంది బుచ్చమ్మ.

Tags:    

Similar News