ఎన్నికల సిత్రం.. ఊరు, ఓటర్లు లేని చోట ఎన్నికలు ఏంటి..?
అక్కడ ఊరే లేదు... ఓటర్లు అసలే లేరు... పంచాయతీ ఎన్నికలు మాత్రం నిర్వహిస్తున్నారు.
అక్కడ ఊరే లేదు... ఓటర్లు అసలే లేరు... పంచాయతీ ఎన్నికలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఊరు... ఓటర్లు లేని గ్రామంలో ఎన్నికలు ఏంటి..? అభ్యర్థులు ఓటర్లను ఎక్కడ వెతుక్కోవాలి...? ఆ గ్రామంలో ఓటు వేసే వారెందరు..?
భద్రాద్రి కొత్తగూడెం పట్టణానికి 6కిలోమీటర్ల దూరంలో గతంలో వెంకటేష్ ఖని గ్రామం ఉండేది. చుంచుపల్లి మండలంలోని వెంకటేష్ ఖనిలో 85కుటుంబాలకు చెందిన 300 జనాభా, 183మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానంతో పాటు 4 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
అక్కడ పేరుకే వెంకటేష్ ఖని పంచాయతీ ఉంది. కానీ ఓటర్లెవరూ ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉండటం లేదు. సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తరణతో ఈ గ్రామం కనుమరుగైంది. పంచాయతీలోని ప్రజలను ఖాళీ చేయించి పట్టణంలోని గంగాబిషన్ బస్తీలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేక కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఊరు, ఓటర్లు లేని గ్రామంలో ఈనెల 14న రెండో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వెంకటేష్‌ఖని సర్పంచ్ అభ్యర్థిగా బొగ్గం మంజుల, 1వార్డు అభ్యర్థిగా ఇస్లావత్ రవి బరిలో నిలిచారు. ఓటర్లను వెతుక్కోవడం కష్టంగా ఉందని మంజుల తెలిపారు. తనను గెలిపిస్తే ప్రజలు నివసిస్తున్నకాలనీలో వసతులు కల్పిస్తానని చెబుతున్నారు.
పాడుబడిపోయిన గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్ వాడి కేంద్రం ఉన్నచోట ఎన్నికలు నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
వెంకటేష్ ఖనిలోని పాడుబడిపోయిన పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద అధికారులు పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి ఎంతమంది ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారో చూడాలి.