Hyderabad: న్యూఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఫ్లయ్ ఓవర్ల మూసివేత
Hyderabad: కొన్ని రోడ్లు మూసివేస్తున్నట్టు ప్రకటన
Hyderabad: న్యూఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఫ్లయ్ ఓవర్ల మూసివేత
Hyderabad: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. కొన్ని రోడ్లు మూసివేస్తున్నారు. PVNR ఎక్స్ ప్రెస్ వే, ORR పై రాత్రి10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతినిస్తారు, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు, షేక్ పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, బాలానగర్ లోని బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్స్ రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకూ పూర్తిగా మూసివేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.
క్యాబ్, టాక్సీ, ఆటోడ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో తప్పకుండా యూనిఫాం ధరించాలని తెలిపారు. అన్ని డాక్యెుమెంట్స్ వెంట ఉంచుకోవాలన్నారు. డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రైడ్ నిరాకరించకూడదని హెచ్చరించారు. ఎవరైనా రైడ్ కి నిరాకరించినట్టు ఫిర్యాదులు వస్తే 500 రూపాయల జరిమానా విధిస్తామన్నారు.ప్రజలతో అనుచితంగా ప్రవర్తించినా లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
బార్, పబ్, క్లబ్ నిర్వాహకులు మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపడానికి అనుమతినిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బార్, పబ్, క్లబ్ నిర్వాహకులు తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే దుష్పరిణామాలపై తమ కస్టమర్లకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే మద్యం సేవించిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలన్నారు.
ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా నడపడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమార్చినట్టు పోలీసులు తెలిపారు. కెమెరాల ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి ఎనిమిది గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
సరైన పత్రాలు సమర్పించని పక్షంలో వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తిసుకుంటామన్నారు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు
వాహనాల నుంచి అధిక సౌండ్ వచ్చినా, నెంబర్ ప్లేట్లు లేకపోయినా వాటిని సీజ్ చేస్తామన్నారు.వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం, వాహనాల పై భాగంలో ప్రయాణించడం,బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన శబ్దాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్,మల్టిపుల్ రైడింగ్ మొదలైన వాటిపై తగిన కేసులను బుక్ చేస్తామన్నారు.
రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా, బాధ్యతతో, సురక్షితంగా ప్రయాణించాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి నేరానికి పదివేల రూపాయల జరిమానా, లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తున్నట్టు తెలిపారు. రెండవ లేదా అంతకంటే ఎక్కువసార్లు నేరానికి పాల్పడితే పదిహేను వేల రూపాయల జరిమానా లేదా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తున్నట్టు తెలిపారు.