తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి కొత్త టెన్షన్‌

Update: 2019-07-23 03:26 GMT

తెలంగాణలో బలపడి రానున్న రోజుల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఓవైపు, ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇలాంటి ఈ సమయంలో పార్టీకి అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించే నాయకుడు మాత్రం కరువయ్యాడు. ఒకప్పుడు శాసనసభలో తమ పార్టీ వాణిని గట్టిగా వినిపించే నాయకులతో ధాటిగా కనిపించిన ఆ పార్టీ, ఇప్పుడు అసలు సమయంలో గొంతెత్తే నాయకుడు లేక అల్లాడుతోంది. ఉన్న ఒక్కగానొక్క నాయకుడి భాష అర్థంకాక, తలలుపట్టుకుంటోంది.

ప్రజల సమస్యలపై గొంతెత్తాల్సిన చోట తడబడుతోంది భారతీయ జనతా పార్టీ. గతంలో ఆ పార్టీ నుంచి తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎన్నికైనా, పార్టీ వాయిస్‌ను సమర్థవంతగా వినిపించే నాయకులే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం, తెలంగాణ వ్యాప్తంగా ఒకే ఒక్క సీటే రావడంతో అసెంబ్లీలో ఆ పార్టీకి బలమైనన వాయిస్ లేకుండాపోయింది. నాలుగు ఎంపీ స్థానాలతో, మాంచి ఊపుమీదికొచ్చిన బీజేపీ, ప్రజా గొంతుకగా ప్రతిధ్వనించి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక ప్రత్యామ్నాయంగా నిలవాలనుకుంటోంది. అయితే, అసెంబ్లీలో మాత్రం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండటంతో, కేసీఆర్‌ సర్కార్‌ను నిలదీసే అవకాశంలేకుండాపోతోంది.

ప్రజావ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు అధికారపార్టీని నిలదీయాలని, ప్రభత్వంపై ఎదురుదాడికి సిద్ధం కావాలని పార్టీ జాతీయ నాయకత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ సమయంలో ఏ ఒక్క అంశాన్నీ వదలకుండా ఆ పార్టీ నాయకులు దూకుడు పెంచారు. కానీ ప్రజల సమస్యలపై పార్టీ గొంతుకను బలంగా వినిపించాల్సిన అసెంబ్లీలో, ఆ పార్టీ మరీ బలహీనపడింది. ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఉన్నాలేనట్టే అన్నట్టుగా మారాడు. ఎందుకుంటే, రాజాసింగ్‌కు తెలుగు సరిగా రాదు. మాట్లాడినా ఆ తెలుగు ఎవరికీ అర్థంకావడం లేదని, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీంతో చట్టసభల్లో బీజేపీ వాయిస్‌ ఏంటో, ప్రజలకూ పూర్తిగా బోధపడ్డంలేదు. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీకి పెద్ద సమస్యగా మారింది.

ప్రజా సమస్యలపై అనర్గళంగా మాట్లాడగలిగి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలిగితేనే పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరిగేది. కానీ రాజా సింగ్ తనకు వచ్చిన తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, అది ఆకర్షించే స్థాయిలో ఉండట్లేదు. ఇక హిందీలో ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నా, దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. హిందీ మాట్లాడే తన నియోజకవర్గ ప్రజలను మెప్పించగలడేమో కానీ, మొత్తం రాష్ట్ర ప్రజలను కదిలించలేడని, ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. అయితే, రాజాసింగ్‌నే తెలుగుపై పట్టు పెంచుకునేలా ప్రయత్నం చేయాలని కొందరు సూచిస్తున్నారు. అయితే, అది అయ్యే పనికాదని, ఆయన గురించి తెలిసినవారంటున్నారు. ఏదేమైనా అసలైన సమయంలో అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించే నాయకుడు లేకపోవటం, బీజేపీకి మైనస్సేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Full View

Tags:    

Similar News