Nayini narasimha reddy : నాయిని నరసింహారెడ్డిలో కొత్త కలత.. ఎమ్మెల్సీ రెన్యువల్ పై ఎడతెగని సస్పెన్స్

Nayini narasimha reddy :కేసీఆర్‌ తర్వాత టీఆర్ఎస్‌లో నాయినే అన్న పేరున్న నేపథ్యంలో, ఒక్కసారిగా నాయిని మాట చెల్లుబాటుకాకపోవడంతో, ఆయన అనుచరుల్లో అలజడి చెలరేగింది. ఏకంగా ఆ‍యన పార్టీ వీడుతారన్న ప్రకంపనలూ రేగాయి. కొన్ని ఘాటు కామెంట్లు చేసిన నాయిని, ఆ తర్వాత సైలెంటయ్యారు. నాయిని ఇలా రకరకాల ఫ్రస్టేషన్స్‌లో వుండటంతో, కూల్ చేసేందుకు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు

Update: 2020-06-27 14:22 GMT

టిఆర్ఎస్ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రిగా కూడా పని చేశారు. పార్టీలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం వుండేది. కేసీఆర్‌ ఎక్కడకు వెళ్లినా ఆ నాయకుడిని వెంట బెట్టుకుని వెళ్లేవారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ముఖ్యమంత్రి, ఆయనను వెంటబెట్టుకుని వెళ్లడం లేదు. కనీసం పలకరించడం లేదట. కానీ ఆయన వేదన, రోదనా, ఆవేదన అది కాదు. ఆయన పదవి ఎక్స్‌పైరీ కాబోతోంది. రెన్యువల్‌ చెయ్యకపోతే, ఆయన ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. అదీ అసలు బాధ. ఇంతకీ ఆయనెవరు ఆయన కథేంటి పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్‌ టూ తానేనని చెప్పుకున్న లీడర్‌కు, ఇప్పుడెందుకీ పరిస్థితి?

నాయిని నర్సింహా రెడ్డి. ఈ పేరు తెలియని వాళ్లంటూ ఉండరు.

ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి టిఆర్ఎస్‌లో ఉంటూ, తెలంగాణ పోరులో కీలకంగా పని చేసిన వ్యక్తి నాయిని. ఉద్యమ సమయంలో సభలు, సమావేశాల్లో ఎక్కడ కేసిఆర్ మాట్లాడినా, ఆ తరువాత మాట్లాడే లీడర్ నాయిని. పార్టీలో అంతటి ప్రాధాన్యత ఉండేది ఆయనకు. తెలంగాణ సాధించిన తరువాత హోం మంత్రిని చేశారు కేసిఆర్. అలా పార్టీలో నాయినికి మంచి గుర్తింపుతో పాటు మంచి పదవి కూడా ఇచ్చారు. రెండోసారి ఎన్నికల సమయంలో, తన అల్లుడికి ముషీరాబాద్ టికెట్ కోసం చాలానే ప్రయత్నం చేశారు. తనకు టికెట్ వద్దు, తన అల్లుడికి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. చివరి వరకు ప్రయత్నం చేసినా, అల్లుడికి టికెట్ ఇప్పించుకోలేకపోయారు.

అదే నాయినిని మస్తాపానికి గురి చేసింది. అప్పట్లో నాయిని అలక, గులాబీ పార్టీకి గట్టిగా గుచ్చుకుందన్న చర్చ జరిగింది.

కేసీఆర్‌ తర్వాత టీఆర్ఎస్‌లో నాయినే అన్న పేరున్న నేపథ్యంలో, ఒక్కసారిగా నాయిని మాట చెల్లుబాటుకాకపోవడంతో, ఆయన అనుచరుల్లో అలజడి చెలరేగింది. ఏకంగా ఆ‍యన పార్టీ వీడుతారన్న ప్రకంపనలూ రేగాయి. కొన్ని ఘాటు కామెంట్లు చేసిన నాయిని, ఆ తర్వాత సైలెంటయ్యారు. నాయిని ఇలా రకరకాల ఫ్రస్టేషన్స్‌లో వుండటంతో, కూల్ చేసేందుకు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కేసీఆర్. తాజాగా మరోసారి నాయినికి పరీక్ష మొదలైంది. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి కాలం కూడా పూర్తవుతోంది. కానీ ఈసారి నాయినికి మండలి యోగం రెన్యువల్ కాదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదే నాయినికి, ఆయన వర్గానికి మింగుపడటం లేదు.

నాయినికి మళ్లీ మళ్లీ పదవులు ఎందుకియ్యాలీ అంటున్నారట టీఆర్ఎస్‌లో కొందరు నేతలు. ఇప్పటికే పార్టీలో ఎన్నో పదవులు ఆయన అనుభవించారని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి హోంమంత్రిగా చేశారు. ఇక పోయినంత కాలం సీనియర్లు అంటూ వాళ్లకే పదవులు ఇవ్వాలా? కొత్తవాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలన్న చర్చను, ముఖ్యమంత్రి దగ్గర పెట్టారట కొందరు నేతలు. అందులోనూ నాయినికి వయస్సు కూడా మీద పడిందని గుర్తు చేస్తున్నారట. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని నాయినికి చెప్పాలని సీఎం చెప్పారట. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అల్లుడికి డిప్యూటీ మేయర్‌ పదవి ఇద్దాంలే అని అనునయించే ప్రయత్నం చేస్తున్నారట.

మొత్తానికి సీఎం మాటలను బట్టి కరాఖండిగా అర్థమైంది ఏంటంటే, నాయినికి ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాదు. ఇది క్లియర్ అంటున్నారు గులాబీ నేతలు.

ఎమ్మెల్సీ రెన్యువల్ కాకుంటే, ఎర్రజెండా ఎగరేసేందుకు సిద్దమని అనుచరులతో అన్నారట నాయిని. పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన తనను, పక్కనపెట్టాలని చూస్తే, ఊరుకునేది లేదనీ చెప్పారట. అయితే, ఇదే సమయంలో గులాబీ అధిష్టానం నుంచీ, నాయినికి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయట. పార్టీ అధినేత సలహా మేరకు పార్టీలో వుంటే, ఆ‍యనకు గౌరవం వుంటుంది, లేదంటే లేదు అంటున్నారట. కాదని బయటకు వెళ్లిపోయి, నోటికి పని చెబితే, ఆయనకే నష్టమని సెలవిస్తున్నారట. ఇదీ నాయిని ఎమ్మెల్సీ రెన్యువల్‌పై టీఆర్ఎస్‌ భవన్‌లో జరుగుతున్న చర్చ. చూడాలి, హైకమాండ్‌ నాయిని ఎమ్మెల్సీని రెన్యువల్ చేస్తారో, చెయ్యకుంటే నాయిని రూటేంటో మాటేంటో.

Tags:    

Similar News