ఓరుగల్లు కాంగ్రెస్‌లో సునామీ ఖాయమా?

ఓరుగల్లు కాంగ్రెస్‌లో సునామీ ఖాయమా?
x
Highlights

నిప్పు లేనిదే పొగ రాదంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొంత మంది పార్టీ మారుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదా.

నిప్పు లేనిదే పొగ రాదంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొంత మంది పార్టీ మారుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదా... ఓ ఎమ్మెల్యే సహా నలుగురైదుగురు డిసిసి అధ్యక్షులు కారెక్కుతున్నారన్న ప్రచారంలో నిజమెంత పార్టీలో గ్రూపు రాజకీయాలు తట్టుకోలేకపోతున్నామని చెబుతున్న ఆ లీడర్లు నిజంగా పార్టీ మారుతారా లేక గ్రూపులకు చెక్ పెట్టేందుకు కారెక్కుతున్నామని బెదిరిస్తున్నారా ఇంతకీ ఓరుగల్లు కాంగ్రెస్ లో ఆ గ్రూపులకు తెరలేపుతున్నదెవరు, వెనకాల ఉండి ఆడిస్తున్నదెవరు. లెటస్ వాచ్.

నాయిని రాజేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో మొదట్నుంచి క్రీయాశీల నేత, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య. అసలు ఈ ఇద్దరి నుంచి మొదలైంది అసలు కథ. ఓరుగల్లు కాంగ్రెస్ నుంచి రెడ్యా నాయక్, గండ్ర లాంటి ఎమ్మెల్యేలు పార్టీ వీడినా ఏ మాత్రం అదరక బెదరక కాంగ్రెస్ జెండాను పట్టుకుని ముందుకు సాగుతున్నది వీరే.

ములుగు నుండి సీనియర్ గా ఉన్న పొదెం వీరయ్య ఇటీవల ఎన్నికలకు ముందు, సీతక్క, రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు భద్రాచలంకు వెళ్లి పోటీ చేసి గెలిచారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితం అంటుంటారు. అయితే ఇటీవల పొదెం పార్టీ మారుతున్నారనే ప్రచారానికి కొందరు తెరలేపారు. సొంత జిల్లా ములుగు రావాలేమో లేక, తన పాత క్యాడర్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క అంతగా పట్టించుకోవడం లేదేమో కాని, వీరయ్య మాత్రం కొంతమంది నేతలపై అసహనంతో ఉన్నారన్నది వాస్తవం.

నాయిని రాజేందర్ రెడ్డి. వరంగల్ డిసిసి అధ్యక్షులు. దశాబ్ద కాలం నుంచి పార్టీకి అండగా ఉంటున్న నాయినికి, ఎక్కడా పోటీ చేసే అవకాశం రావడం లేదు. అలాగని పార్టీ వీడే అవసరం కూడా లేదు. కాకపోతే ఇటీవల పరిణమాలు చూసి నొచ్చుకున్న నాయిని, పార్టీ అవసరమా అని ఆలోచిస్తున్నట్టు ప్రచారం మాత్రం సాగుతోంది. నిప్పు లేనిది పొగ రాదు కాబట్టి ఈ ప్రచారానికి ఓ కారణం ఉందంటున్నారు. ఇటీవల పొదెం వీరయ్య, నాయిని రాజేందర్ రెడ్డి సహా ఆరుగురు జిల్లాల డిసిసి అధ్యక్షులు, ఓ మీటింగ్ పెట్టి పార్టీలోని వైరి వర్గంపై చర్చ చేసి ఏకంగా పిసిసి చీఫ్ ఉత్తమ్‌కు ఫోన్ చేసి, తామంతా సామూహికంగా పార్టీ వీడుతున్నామని చెప్పేసారట. దీంతో ఉత్తమ్ మరో సీనియర్ నేతను రంగంలోకి దింపారట.

జనగామ డిసిసి అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఓరుగల్లు కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తున్నారని వీరి కాంప్లైట్. మొన్నటి ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి ఎర్రెబెల్లి దయాకర్ రావుపై ఓటమి అనంతరం జనగామ డిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చెపట్టారు రాఘవరెడ్డి. ఎలాగూ జనగామ డిసిసి చీఫ్‌ తానే కాబట్టి, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో జనగామ నేత, సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్యకు చెందిన క్యాడరెవ్వరికీ జంగా టికెట్లివ్వలేదు. ఒక దశలో తాను జనగామ నుండే పోటీ అని ప్రచారం చేసుకుంటూ, జనగామలో పొన్నాల లక్ష్మయ్య ఇంటిపక్కనే ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. జనగామ అంతా తిరుగుతూ పొన్నాల ఎలాగూ రావడం లేదు కదా, ఇకపై అన్నీ తానే అని చెప్పుకునే ప్రయత్నం చేశారట. విషయం తెలుసుకున్న పొన్నాల, జంగా రాఘవ రెడ్డిపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. తాను పార్టీలోకి తీసుకుని రాజకీయ భిక్షపెట్టి ఎంకరేజ్ చేస్తే, చివరికి తన కింద నీల్లు తీసుకువస్తున్నారన్న కామెంట్ కూడా పొన్నాల చేశారట.

జంగా రాఘవరెడ్డి అంతటితో ఆగకుండా వరంగల్ అర్బన్ జిల్లాలో తలదూర్చుతున్నారని నాయిని రాజేందర్ రెడ్డి సీరియస్ కంప్లైంట్. కాజీపేటలో తనకున్న క్యాడర్ తో షో చేయడమే కాక, మీటింగ్ లు పెడుతున్నారట. వీలైతే వరంగల్ పశ్చిమ నుంచి వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటున్నానన్న బలమైన సంకేతాలిచ్చేందుకు, వచ్చే గ్రేటర్ ఎన్నికలను జంగా టార్గెట్ చేసుకున్నారట. పార్టీలో సీనియర్ అయిన తనకు వ్యతిరేకంగా మీటింగ్ లు ఏంటని, నాయిని ఫైరయ్యారట. ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట. అందుకే పార్టీపై కొంత అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే ఎవరూ అని వెతికి, పొదెం వీరయ్యకు విషయం చెప్పి, ఇష్యూ చేద్దామని డిసైడ్ అయ్యారట. తనను కూడా ములుగు నుంచి భద్రాచలం పంపడం ఏంటీ తానూ రెడీ అంటూ, నాయిని గ్రూపుతో జట్టు కట్టి చలో పైట్ అంటున్నారట పొదెం.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తన నివాసంలో నాయిని రాజేందర్‌రెడ్డితో భేటీ అయి విషయం చెప్పేసారట. ఈ అంశంపైన పార్టీ కోర్‌ కమిటీలో మాట్లాడదామని ఆయనకు సూచించారు. వీరయ్యకు ఫోన్‌ చేసిన వీహెచ్‌...ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆయనను కోరినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జరిగేలా ప్రయత్నిస్తాననీ వీహెచ్ వారికి హామీ ఇచ్చారని... ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తోనూ మాట్లాడారట. మొత్తానికి తెలంగాణ జిల్లా కాంగ్రెస్‌లో చెలరేగిన ఈ అసంతృప్తి జ్వాలలు మరింత మండుతాయో... పార్టీ పెద్దల రంగప్రవేశంతో చల్లారుతాయో చూడాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories