Earthquake: భూకంపంతో ఊగిపోయిన తెలంగాణలోని పలు జిల్లాలు..
Earthquake: తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. కరీంనగర్ జిల్లాలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కొన్నిసెకన్లపాటు భూ ప్రకంపనలు సంభవించాయి. రెక్టర్ స్కేలుపై 3.8తీవ్రతగ నమోదు అయ్యినట్లు సమాచారం. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కంపించింది. భూమి కంపించడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలో ఉన్నవారు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో గోడలు, కిటికీలు స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు.
కరీంనగర్ జిల్లాతోపాటు నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అక్కడ కూడా కొంతసేపు భూమి కంపించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ప్రకంపనలు 5 నుంచి 7 సెకన్లపాటు ఈ ప్రకంపనలు కొనసాగినట్లు సమాచారం. ఒక్కసారిగా భూమి ఉలిక్కిపడడంతో ఇళ్లలో సామాగ్రి స్వల్పంగా కదిలినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
ఈ ప్రకంపనల సమాచారాన్ని తెలుసుకున్న రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు వెంటనే అప్రమత్తమయ్యాయి. భూకంప తీవ్రతను అంచనా వేసేందుకు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ నుంచి అధికారిక సమాచారం వచ్చేంత వరకు అధికారులంతా పరిస్థితిని పర్యవేక్షించారు.
కాగా తెలంగాణ ప్రాంతం సాధారణంగా తక్కువ భూకంప తీవ్రత కలిగిన జోన్ 2 లో ఉంది. అయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఫాల్ట్ జోన్ ఉండటం వల్ల అప్పుడప్పుడు భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. రెక్టర్ స్కేలుపై 5 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు తెలంగాణలో చాలా అరుదుగా వస్తాయని నిపుణులు తెలిపారు.