Pashamylaram: పారిశ్రామికవాడలో భారీ పేలుడు.. 8 మంది మృతి
Pashamylaram: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Pashamylaram: పారిశ్రామికవాడలో భారీ పేలుడు.. 8 మంది మృతి
Pashamylaram: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అక్కడి సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, వీరిలో 8 మంది దుర్మరణం చెందారు. ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రికి తరలించిన ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందారు.
పేలుడు తీవ్రతతో కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఉత్పత్తి విభాగం భవనం పూర్తిగా కూలిపోయింది. మరో భవనం కూడా ధ్వంసమైంది. పరిశ్రమ లోపల ఇంకా కొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. కొందరి ఫోన్లు స్విచ్ ఆఫ్‌గా ఉండటంతో, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
గాయపడినవారిని చందానగర్, ఇస్నాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలానికి 11 ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు కొనసాగించాయి.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాదంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఘాటైన వాసనలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.