Hyderabad: తల్లిని గెంటేసిన కుమారులు.. ఇంటిని సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

Hyderabad: మలక్‌పేట మూసారాంబాగ్‌లో ఓ తల్లిని గెంటేసిన కుమారుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2025-06-26 11:43 GMT

Hyderabad: తల్లిని గెంటేసిన కుమారులు.. ఇంటిని సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

Hyderabad: మలక్‌పేట మూసారాంబాగ్‌లో ఓ తల్లిని గెంటేసిన కుమారుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 90 ఏళ్ల వృద్ధురాలైన శకుంతలాబాయిని తల్లి అని చూడకుండా బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపించిన ఇద్దరు కుమారుల తీరును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. దీంతో సంబంధిత రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే — శకుంతలాబాయికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. భర్త మృతిపడిన తర్వాత కొడుకుల వద్దనే ఆమె నివసిస్తూ వచ్చారు. కానీ, తల్లి ఆలనాపాలన బాధ్యత తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ, చివరకు ఇంటి నుంచి గెంటేశారు. దిక్కుతోచని వృద్ధురాలు ప్రస్తుతం సైదాబాద్‌లోని చిన్న కుమార్తె వద్ద ఉంటోంది.

ఈ నేపథ్యంలో శకుంతలాబాయి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సహకారంతో 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ జిల్లా ఆర్డీవోను ఆశ్రయించారు. ఇద్దరు కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు, తల్లి పేరున ఉన్న ఇంటిని అప్పగించమని ఆదేశించారు. అయితే వారు అంగీకరించినప్పటికీ గడిచిన నెలలుగా ఇంటిని ఖాళీ చేయకపోయారు.

తాజాగా, మూడు రోజుల క్రితం సైదాబాద్ తహశీల్దార్ జయశ్రీ ఇద్దరికి ఫైనల్ నోటీసులు జారీ చేశారు. రెండురోజుల్లో ఇంటిని ఖాళీ చేయకపోతే సీజ్ చేస్తామని స్పష్టంచేశారు. చివరకు గడువు ముగియడంతో తహశీల్దార్, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఇంటికి వెళ్లగా, అప్పటికే కుమారులు తాళం వేసి వెళ్లిపోయారు. వెంటనే అధికారులు ఆ ఇంటిని అధికారికంగా సీజ్ చేసి, ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు.

ఈ ఘటన మలక్‌పేటలో చర్చనీయాంశంగా మారింది. తల్లిపై కుమారుల నిర్వాకంపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Tags:    

Similar News