Elections: సర్పంచ్ ఎన్నికల ఏకగ్రీవాలకు లైన్ క్లియర్.. ఈసీ తుది నిర్ణయం?
Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా చుట్టే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలు, టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ సారి ఏకగ్రీవ ఎన్నికలు జరిగే స్థానాల్లో నోటాను ఓ అభ్యర్థిగా పరిగణించాలని ఎన్నికల సంఘం ఆలోచన చేసినప్పటికీ..ఆ ప్రతిపాదన అమలు కావడం అసాధ్యమని తెలుస్తోంది. ఈ అంశంపై ఈసీ పలువు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలు, టీడీపీ, జనసేన పార్టీలు పాల్గొన్నాయి. పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోలేకపోయింది.
ఎన్నికల సంస్కృతిని మెరుగుపరిచే ఉద్దేశ్యంతో నోటాను అభ్యర్థిగా గుర్తించడం ఓ కొత్త ప్రణాళికగా ఎన్నికల సంఘం పరిశీలించినా..దాని అమలుపై పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఏకగ్రీవ స్థానాల్లో ఓటింగ్ నిర్వహించడం భారీ ఖర్చుతో కూడుకున్న విషయమని తెలిపింది. రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించడం ఉత్తమ మార్గమని అభిప్రాయం వ్యక్తంచేసింది. బీఆర్ఎస్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఏకగ్రీవం కోసం రాజకీయంగా ఒత్తిళ్లు, బెదిరింపులు చోటుచేసుకునే అవకాశం ఉందని నోటాను అభ్యర్థిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఇక బీజేపీ ఈ అంశంపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించకుండా ప్రస్తుత న్యాయపరమైన వివాదాలు ఉన్నందున ఎలాంటి నిర్ణయం చెప్పలేమని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం లేదని..ఈ వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని తెలిపింది. మరోవైపు సీపీఎం తన వైఖరిని వెల్లడిస్తూ..నోటాకు అభ్యర్ధికి మించిన ఓట్లు వచ్చినా తిరిగి ఎన్నికలు నిర్వహించడం అనవసరమని అభిప్రాయపడింది.