Telangana Assembly: కేసీఆర్ ఎంట్రీ.. ఎగ్జిట్! కేవలం 3 నిమిషాల పాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత!
Telangana Assembly: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29, 2025) అంచనాలకు భిన్నంగా ప్రారంభమయ్యాయి.
Telangana Assembly: కేసీఆర్ ఎంట్రీ.. ఎగ్జిట్! కేవలం 3 నిమిషాల పాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత!
Telangana Assembly: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29, 2025) అంచనాలకు భిన్నంగా ప్రారంభమయ్యాయి. సుమారు 9 నెలల విరామం తర్వాత అసెంబ్లీకి హాజరవుతున్న ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలో గంటల తరబడి ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన కేవలం 3 నిమిషాల్లోనే తన పర్యటనను ముగించి వెనుదిరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సభలో కనిపించిన ఆసక్తికర దృశ్యం
సాధారణంగా సభ ప్రారంభమయ్యాక సభ్యులు వస్తుంటారు. కానీ ఈరోజు కేసీఆర్ మిగతా సభ్యులందరికంటే ముందుగానే అసెంబ్లీ హాల్‌లోకి చేరుకున్నారు. ఆయన తన సీటులో కూర్చున్న కొద్దిసేపటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోకి వచ్చారు. నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి, ఆయనతో కరచాలనం (Handshake) చేసి మర్యాదపూర్వకంగా పలకరించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను కలిసి అభివాదం చేశారు.
సభ ప్రారంభమైన వెంటనే సభలో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఊహించని విధంగా కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి, సభ ప్రారంభమైన కేవలం 3 నిమిషాల్లోనే బయటకు వచ్చేశారు. ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడకుండా ఉండాలంటే కనీసం ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీకి హాజరు కావాల్సి ఉంటుంది. కేవలం ఆ సాంకేతిక కారణం కోసమే ఆయన వచ్చి వెళ్లారా? అనే చర్చ మొదలైంది. అసెంబ్లీ నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని తన నంది నగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు.