అసలు పోడు భూములు అంటే ఏంటి..పోడు భూముల వెనుక చీకటి కోణం ఉందా?

Update: 2019-07-03 13:48 GMT

తరతరాలుగా అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలు ఆ అడవిపై హక్కు కోసం ఎదురు చూస్తున్నారు. సాంప్రదాయ బద్దంగా వస్తున్న పోడు వ్యవసాయాన్ని గుర్తించి ఆ భూములపై హక్కులు కల్పించాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. అంతలోనే పోడుభూములపై పాడు దందా మొదలైంది. మొన్న ఆదిలాబాద్, నిన్న ఖమ్మం... రేపు ఎక్కడ? అసలేంటి గొడవ. అసలు పోడు భూములు అంటే ఏంటి?

అటవీ, పోడు భూములపై హక్కుల కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాల తర్వాత 2006లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. అంతకు ముందు అటవీ భూములను సాగుచేసుకుంటున్న వారికి ఈ చట్టం ప్రకారం హక్కులు కల్పించాల్సి ఉండగా నాటి ఉమ్మడి ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వచ్చాయ్‌. అడవుల్లోనూ, కొండ వాలుల్లోనూ చిన్న చిన్న చెట్లను, పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయమని ఆదివాసీలు పిలుస్తారు. సాంప్రదాయ బద్దంగా చేసుకునే ఇటువంటి వ్యవసాయంపై తెలంగాణ రాష్ట్రంలో లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయ్‌. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుదారులను గుర్తించి సబ్‌డివిజన్‌ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలకు పంపాల్సి ఉంది. ఈ కమిటీల్లో నిర్ణయించిన విధంగా పట్టాలు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కట్టబెట్టింది. అటవీ భూములపై ఆదివాసీలకు హక్కులు ఇచ్చే విషయంలో అటవీ శాఖ అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది.

ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అటవీ హక్కుల కోసం దరఖాస్తులు పెద్ద సంఖ్యలో అందాయి అప్పట్లో. వీటి ప్రకారం 19.66 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కులు కల్సించాల్సి ఉంది. అదెంత వరకు అమలైందో అధికారులకే తెలియాలి. సామూహిక హక్కులతో కేవలం ఫల సాయంలో కొంత అనుభవించే అధికారం ప్రజలకు ఉంటుందే తప్ప యాజమాన్య హక్కులు, అధికారాలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దీని వల్ల ఆదివాసీ కుటుంబాలకు ప్రయోజనం లేకుండా పోయింది.

ఇక అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములకు హక్కులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం అది చేయకపోగా హరితహారం పేరుతో భూములను స్వాధీనం చేసుకోవటంపై చర్చ జరుగుతోందిప్పుడు. ఈ పరిస్థితుల్లోనే కొందరు అటవీ పోలీస్‌ అధికారులు ఆదివాసీల పట్ల దురుసుగా ప్రవర్తించటం, అక్రమ కేసులు పెట్టడంతో గిరిజన ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయ్‌. పోడు భూముల విషయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికి ఇంకా అధికారిక ఉత్తర్వులు కానీ కొత్త మార్గదర్శకాలు కానీ విడుదల కాకపోవడంపై మండిపడుతున్నాయ్‌.

పోడు భూముల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. రాజకీయం జోక్యంతో సమస్యకు మరింత ఆజ్యం పోసినట్లవుతోంది. పోడు భూముల వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి. కాగజ్‌నగర్‌ ఘటన సమస్య తీవ్రతకు పరాకాష్టగా నిలుస్తుండగా ఖమ్మం జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది. అసలు కాగజ్‌నగర్‌లో ఏం జరిగింది?

పోడుభూముల కోసం పోరాడుతున్న గిరిజనులు అసలు సూత్రదారులను పక్కన పెట్టి అటవీ అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దశాబ్దాల నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుంలందరికి ఆ భూములపై హక్కును కల్పిస్తే ఈ సమస్యకు అవకాశమే ఉండేది కాదు. ప్రభుత్వం ఈ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించకుండా తాత్సారం చేస్తుండడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ఓవైపు చెట్ల నరికివేతతో అడవులన్నీ మైదానాలుగా మారుతుండడం, ఆ మైదానాలు క్రమంగా పోడు సాగు భూములుగా మారుతున్నట్లు చెబుతున్నారు.

కేవలం వర్షధారంపైనే ఆధారపడుతున్న ఈపోడు వ్యవసాయం గిరిజన కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోంది. అటవీశాఖ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ భూముల ఆక్రమణను అడ్డుకుంటోంది. ఈ అధికారుల వైఖరిని గిరిజనులు నిరసిస్తూ ఆందోళనలు, దాడులకు దిగడం ఘర్షణలకు తావిస్తోంది. అటు స్మగ్లర్ల దాడులు, ఇటు పోడు సాగుదారుల దాడులతో అటవీ శాఖ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ క్రమంలో కాగజ్‌నగర్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కృష్ణతో పాటు ఆయన అనుచరులు అటవీ అధికారులపై జరిపిన దాడుల వ్యవహారం మరోసారి అటవీశాఖ ఆస్థిత్వాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు వాదనలు తెరపైకి వస్తున్నాయి.

పోడు భూముల వ్యవహారం అటు అటవీశాఖ అధికారుల మెడకు చుట్టుకుంటుండగా గిరిజనులకు ఓ సమస్యగా మారింది. దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలంటూ గిరిజనులు నినదిస్తున్నారు. ప్రభుత్వాలు వారి సమస్యను పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తూనే ఆ హామీని విస్మరిస్తుండడం రీవాజుగా మారింది. దీంతో అటవీ భూములు రక్షించాల్సిన ఆ శాఖ అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అడకత్తెరలో పోకలాగా అటవీ అధికారుల పరిస్థితి మారిపోయింది. అటవీ భూములను రక్షించేందుకు ఆశాఖ అధికారులు అవలంభిస్తున్న విధానాలు వివాదాస్పదమవుతున్నాయి. పోడు భూముల వ్యవహారంలో రాజకీయ జోక్యం మితిమీరిపోవడం సమస్య జఠిలానికి కారణంగా కనిపిస్తోంది.

పోడు భూములపై హక్కుల కోసం అటవీ అధికారులపై వరుసగా జరుగుతున్న దాడుల వ్యవహారం ఆశాఖ పనితీరుపై ప్రభావం చూపుతుంది. కొంతకాలం నుంచి వరుసగా దాడులు జరుగుతుండడంతో ఆ శాఖలో పని చేస్తున్న అధికారులందరు భయభ్రాంతులకు గురవుతున్నారు. విధాన పరమైన నిర్ణయాలు లేకపోవడంతో అటవీఅధికారులు కూడా పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. అటవీ చట్టాన్ని రక్షించేందుకే వారు కఠిన చర్యలు తీసుకుంటున్నారే తప్ప వారి వ్యక్తిగత ప్రాబల్యం కోసం, శాఖ పరమైన ప్రాబల్యం కోసమో కాదన్నది అటవీ అధికారుల వాదన. ఈ క్రమంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆ శాఖ ఆస్థిత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నది వారి అభిప్రాయం.

Full View 

Tags:    

Similar News