Hyderabad New Year 2026: న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల ఫోకస్.. 3 కమిషనరేట్లలో మొత్తం 12 టీమ్స్..

Hyderabad New Year 2026: న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారం రోజుల ముందు నుంచే నగరంలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు.

Update: 2025-12-30 09:00 GMT

Hyderabad New Year 2026: న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల ఫోకస్.. 3 కమిషనరేట్లలో మొత్తం 12 టీమ్స్..  

Hyderabad New Year 2026: న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారం రోజుల ముందు నుంచే నగరంలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. సిటీలో మొత్తం 7 ప్లటూన్ల బలగాలతో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మద్యం తాగి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10వేల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. మద్యం తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేని ప్రయాణం వంటి ఉల్లంఘనలు గుర్తించేందుకు రహదారులపై ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకున్నప్పుడు డ్రైవర్లు వాటిని నిరాకరించకూడదని... అలా చేస్తే ఈ-చలాన్ల రూపంలో భారీ జరిమానా విధిస్తారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినా లేదా అదనపు చార్జీలు డిమాండ్ చేసినా కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్నారు.

భాగ్యనగరంలో కొత్త సంవత్సరం సంబరాల్లో డ్రగ్స్‌ వాడకాన్ని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకలను సురక్షితంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకల్లో డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవడానికి పోలీసులు ముందుస్తు వ్యూహాలను రెడీ చేశారు. పబ్‌లు, క్లబ్‌లు, భారీ ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో స్పెషల్ ఫోర్స్, నార్కోటిక్ విభాగం నిఘా ఉంచనున్నాయి. కేవలం పబ్‌లే కాకుండా సర్వీస్ అపార్ట్‌మెంట్లు, ఫాంహౌస్‌లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేటు పార్టీలపై నిఘా పెట్టారు. బార్, పబ్, క్లబ్‌లకు వచ్చే కస్టమర్లు మద్యం మత్తులో వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పోలీసులు సూచించారు లేకపోతే వారిపై చర్యలు తప్పవన్నారు. పార్టీ ముగిశాక ఎవరైనా మద్యం మత్తులో వాహనం నడుపుతున్నారని తెలిస్తే అడ్డుకోవాలన్నారు.

కొత్త ఏడాది వేడుకల సందడిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు సమయ, నిబంధనలు ఖరారు చేశారు. ఈవెంట్ నిర్వహించే వాళ్ళు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని సూచిస్తున్నారు. వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఙప్తి చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు కచ్చితంగా రాత్రి ఒంటిగంటకే తమ కార్యకలాపాలు ముగించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే వారి వ్యాపార లైసెన్సులు రద్దు చేస్తారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి రద్దీ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. వేడుకల పేరుతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కోరుతున్నారు. ఇతర విభాగాల నుంచి కూడా పోలీసులను రప్పించి రద్దీ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. నగరం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే స్పందించేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు.

Tags:    

Similar News