హైదరాబాద్‌లో కుండపోత వర్షం .. పలు ప్రాంతాలు జలమయం

Hyderabad: వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ

Update: 2023-05-01 01:45 GMT

హైదరాబాద్‌లో కుండపోత వర్షం .. పలు ప్రాంతాలు జలమయం

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గత కొన్నిరోజులుగా నగరంలో వర్షం పడుతూనే ఉంది. నిన్న సాయంత్రం చిరు జల్లులతో మొదలైన వర్షం భారీగా మారింది. జూబ్లీ హీల్స్, మాదాపూర్ ఫిలింనగర్, షేక్ పేట్, పంజాగుట్ట, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మణికొండ, శేరిలింగం పల్లి, పటాన్ చెరు, మెహిదీపట్నం కొండాపూర్, కేపీహెచ్ బీ, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలో ఉన్న నాలాలు, చెరువులు పొంగి పొర్లాయి. రోడ్లన్నీ జలయయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇళ్లనుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.

హైదరాబాద్లో గంట వ్యవధిలోనే 7.8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అత్యధిక వర్షపాతం హిమాయత్‌నగర్‌, శేరిలింగంపల్లిల్లో నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరోవైపు, హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరదనీరు చేరడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి.

వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో..ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది

గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో రాగల 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 30 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News