Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
Rains: తెల్లవారుజాము 4 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షం
Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
Rains: హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, బంజారాహిల్స్, పంజాగుట్టలలో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్లు కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాలనీల్లోకి నీరు చేరాయి. నగరంలో మరో గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని.., జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు. రోడ్లపై మ్యాన్‌హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఏపీ, తెలంగాణ మీదుగా మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం కొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాటిలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి.