ఖమ్మం మున్సిపాలిటీలో డివిజన్ల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్

Update: 2021-02-05 02:33 GMT

Representational Image

ఖమ్మం కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జారీ చేయడం సిట్టింగ్ కార్పొరేటర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఓ వైపు డివిజన్ల పునర్విభజన ఖాయంగా కనిపిస్తుండటం, రిజర్వేషన్ మారే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇన్నాళ్లు డివిజన్ తమ సొంతం అనుకున్న కొందరు కార్పొరేటర్లకు మింగుడు పడడం లేదు. ఇప్పటివరకు గెలిచిన డివిజన్​లోనే మళ్ళీ పోటీకి దిగుతామనే నమ్మకంతో ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్లు ఈసారి రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుందా లేదా అనే టెన్షన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు

ఖమ్మం కార్పొరేషన్ కు గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ డివిజన్ల పునర్విభజన సిట్టింగ్ కార్పొరేటర్లలో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతమున్న 50 డివిజన్లు 60 డివిజన్లవుతుండటం వల్ల రిజర్వేషన్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు డివిజన్ ను నమ్ముకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సిట్టింగ్ కార్పొరేటర్లు రిజర్వేషన్ మారితే ఏం చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

ఎన్నికలు సమీపిస్తుండటం వల్ల పెండింగ్ పనుల్ని పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే పునర్విభజనలో ప్రస్తుతం వారికి బలమున్న ప్రాంతాలు మరో డివిజన్​లోకి వెళ్లే అవకాశం ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా? లేక రిజర్వేషన్లు తేలేవరకు వేచి చూడాలా అన్న ప్రశ్నతో సిట్టింగులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఫలితాలతో ఒకింత నిరాశకు లోనైన టీఆర్ఎస్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను సవాల్ గా తీసుకుని ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. బీజేపీ నేతలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంకుని కాపాడుకునే పనిలో పడింది. ఈ సారి కార్పొరేషన్ ఎన్నికల్లో

మరో 10 డివిజన్లు పెరగనుండటంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు అధికార పార్టీలో టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయమనే భావనలో ఉన్న నేతలు ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.

అయితే ఖమ్మం కార్పొరేషన్ లో పాలకవర్గంగా ఉన్న టీఆర్‌ఎస్‌లో ప్రస్తుత పునర్విభజన ప్రక్రియ కొందరు సిట్టింగులను కలవరానికి గురిచేస్తోంది. జీహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజల్లో వ్యతిరేక ఉన్న సిట్టింగులకు టికెట్లు ఇచ్చి దెబ్బతిన్న టీఆర్ఎస్ ఖమ్మం ఎన్నికల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివాదాల్లో తలదూర్చిన కార్పొరేటర్లను పక్కనబెట్టాలన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కార్పొరేటర్లు, డివిజన్ ముఖ్య అధ్యక్షులతో జరిగిన సమావేశంలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామన్న మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు ఇందుకు మరింతగా బలం చేకూర్చుతున్నాయనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఓ వైపు నగరంలో ఎన్నికల ప్రచారానికి తెరలేపిన టిఆర్ఎస్ డివిజన్ల వారీగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, ముఖ్య ప్రాంతాల్లో సభలకు శ్రీకారం చుట్టినా టికెట్లు ఎవరికి దక్కుతాయి ఎవరికి దక్కవన్న చర్చే ప్రధానంగా ఆ పార్టీలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టికెట్లు ఖరారు చేస్తారంటూ ముఖ్య నేతలు చెబుతున్న మాటలతో అధికార పార్టీ కార్పొరేటర్లలో సీట్ల త్యాగం తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీలో సీటు దక్కేదెవరికి సిట్టింగులు గల్లంతయ్యేదెవరికి అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది

Full View


Tags:    

Similar News