నేటినుంచి రాష్ట్రంలో గవర్నర్‌ పర్యటన

Update: 2019-12-09 02:25 GMT
గవర్నర్ తమిళిసైసౌందర్‌రాజన్‌

గవర్నర్ తమిళిసైసౌందర్‌రాజన్‌ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో చేసే పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటనను సోమవారం ఉదయం 9.30 ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా పురాతన కట్టడాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. అంతే కాకుండా జిల్లాలలోని ప్రజల సమస్యలను గవర్నర్ తెలుసుకోనున్నారు. గవర్నర్ పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ, భద్రతా దళాలు గట్టి ఏర్పాట్లను చేసారు.

ఇక పర్యటనకు సంబంధించిన పూర్తివివరాలకొస్తే

సోమవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ బయలుదేరుతారు.

ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్ట చేరుకొని 11.30 వరకు యాదగిరి లక్షీ నరసింహ స్వామి దర్శనం చేసుకోనున్నారు.

అనంతరం యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులు స్వయంగా పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 1 వరకు వరంగల్‌ పట్టణానికి చేరుకొంటారు. 1 నుంచి 3 గంటల వరకు వరంగల్ లోని కాకతీయుల కోటలోని చారిత్రక కట్టడాలను, పరిసర ప్రాంతాలను పరిశీలించి చరిత్రకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటారు. అనంతరం టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షోను తిలకిస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండలోని హరిత హోటల్‌కు వెళ్లి అధికారులతో విందులో పాల్గొంటారు.

3 గంటల తరువాత సుబేదారిలోని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సెంటర్‌లో జరిగే సమావేశంలో ఆమె పాల్గొననున్నారు.

ఆ తర్వాత వరంగల్ లో ఉన్న చారిత్రక కట్టడాలయిన వేయిస్తంభాల ఆలయం, భద్రకాళీ అమ్మవారి ఆలయాలను సందర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరించనున్నారు. తిరిగి రాత్రి వరంగల్‌లోనే బసచేయనున్నారు.

ఇక మంగళవారం కార్యాచరణకు వస్తే

మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజ్‌, లక్ష్మీ పంప్‌హౌస్‌, సరస్వతి బ్యారేజ్‌ను సందర్శిస్తారు.

అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు రామగుండంలోని ఎన్టీసీపీలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకొని అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.

బుధవారం ఉదయం ఎన్టీపీసీలోని ప్రభుత్వ పాఠశాలకు చేరుకుంటారు. అక్కడి విద్యార్థినులు ప్రదర్శించే 'కళరిపయట్టు' అనే మర్మ కళను చూస్తారు.

ఉదయం 10:15 గంటలకు పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లోని ధర్మారం ఎక్స్‌రోడ్డుకు చేరుకుంటారు.

అక్కడ 10:30గంటల వరకు శ్రీ రాజరాజేశ్వర నాన్‌ ఓవెన్‌ క్లాత్‌ బ్యాగుల తయారీ యూనిట్‌ను, బ్యాగుల తయారిని దగ్గరుంచి పరిశీలించనున్నారు.

తిరిగి 10:45 గంటలకు పెద్దపల్లికి చేరుకొని సబల శానిటరీ నాప్కిన్‌ కేంద్రాన్ని సందర్శించనున్నారు.

అనంతరం పెద్దపల్లి మండలం కాసులపల్లిని సందర్శించనున్నారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌కు చేరుకుంటారు.

అక్కడ నిర్వహిస్తున్న పనులను దగ్గరుండి పరిశీలిస్తారు.

బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

గవర్నర్ చేయనున్న ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రతి జిల్లాలోనూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అనుమానస్పదంగా ఎవరు కనిపించినా వారిని బైండోవర్ చేయనున్నారు.




Tags:    

Similar News