Ration Card: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక అప్డేట్.. కార్డులపై వారిద్దరి ఫొటో
Ration Card: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జనవరి 26న లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. త్వరలోనే కొత్త కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఫార్మాట్ లో అన్ని ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడేలా ఏటీఎం కార్డు సైజులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించనున్నారు. ఈ కార్డులో చిప్ లేదా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలా అనే అంశంపై ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
కొత్త రేషన్ కార్డుకు సంబంధించి సీఎం రేవంత్ కార్డు డిజైన్ ను అధికారులతో చర్చించి కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం. ఈ కార్డుపై ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో, మధ్యలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగో ఉండేాలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈసారి కొత్త రేషన్ కార్డులను కుటుంబంలోని గృహిణి పేరుమీదే జారీ చేయనున్నట్లు సర్కార్ వెల్లడించింది. అయితే కార్డుపై కుటుంబ సభ్యుల ఫొటో ఉంచాలా లేకు కేవలం గృహిణి ఫొటో మాత్రమే ఉంచాలా అనే దానిపై ఇంకా అధికారుల నుంచి స్పష్టత రాలేదు. కొన్ని ప్రతిపాదనల ప్రకారం..కుటుంబ సభ్యుల ఫొటో స్థానంలో వారి వివరాలను ప్రింట్ చేయాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.