టిక్ టాక్. ఆ వీడియోలతో టాలెంట్ సంగతేమో కానీ, అసలు పనులు వదిలేసి అదే పనిగా పిచ్చిలో మునిగితేలుతున్నారు. టిక్ టాక్. ఈ మత్తులో విధులను మర్చిపోతున్నారు ఉద్యోగులు. తమ బాధ్యతలు వదిలేసి.. టిక్ టాక్ లో పాటలు పాడుతూ, డైలాగ్స్ చెప్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చివరికి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ వైద్యులు చేసిన టిక్ టాక్ వీడియోలు వైరల్ అయ్యాయి. రోగులు చికిత్స కోసం రోజంతా నానా అవస్థలు పడుతుంటే, కొందరు జూనియర్ డాక్టర్లు మాత్రం టిక్ టాక్‌లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో ఇద్దరు వైద్యులు చేసిన టిక్ టాక్ వీడియోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆస్పత్రికి వస్తే పట్టించుకోవడం లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత పది రోజుల క్రితం విధుల్లో టిక్ టాక్ వీడియోలు చేసిన ఖమ్మం కార్పోరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడింది. విధులు నిర్వహించకుండా, టిక్‌టాక్ చేస్తూ మీడియాకు దొరికారు 9 మంది ఉద్యోగులు. ఆఫీసులో పనులు చేయకుండా కాలపక్షేపం చేస్తూ టిక్‌టాక్ వీడియోలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్.. టిక్‌టాక్ చేసిన సిబ్బందిపై వేటు వేశారు. 9 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.