తేజేశ్వర్‌ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. నిందితులు అస‌లేం ప్లాన్ చేశారో తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే!

Tejeshwar Murder Case Updates: గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు.

Update: 2025-06-25 04:49 GMT

తేజేశ్వర్‌ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. నిందితులు అస‌లేం ప్లాన్ చేశారో తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే!

Tejeshwar Murder Case Updates: గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం — తేజేశ్వర్‌ను హతమార్చిన అనంతరం ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్య ముందుగా లద్దాఖ్ వెళ్లి, అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలని పక్కా ప్రణాళిక రచించారు.

ఈ వ్యూహంలో భాగంగా ఇద్దరూ రెండు విమాన టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు రూ.20 లక్షల నగదు ఏర్పాటుచేశారు. ఈ మొత్తం నుంచే సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. జూన్ 17న తేజేశ్వర్‌ను హత్య చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని కర్నూలులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో పూడ్చాలని అనుకున్నారు. కానీ పోలీసులకు దొరికిపోతామనే భయంతో పాణ్యం వైపు అడవిలో మృతదేహాన్ని పడేశారు.

తేజేశ్వర్ చేతిపై ఉన్న 'అమ్మ' అనే పచ్చబొట్టుతోనే మృతదేహాన్ని గుర్తించగలిగారు. ఇదిలా ఉండగా, కేసు వెలుగులోకి రావకముందే ప్రధాన నిందితులు విదేశాలకు పారిపోవాలనుకున్నా, తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం కావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె అన్నింటిని ఒప్పుకోవడంతో, తిరుమలరావు ఒక్కడే పారిపోవాలని ప్రయత్నిస్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

తిరుమలరావు మొదట తన భార్యను చంపి, ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే అప్పటికే ఐశ్వర్య తేజేశ్వర్‌ను పెళ్లి చేసుకోవడంతో, అతడు కర్నూలులో కాపురం పెట్టేందుకు అంగీకరించకపోవడంతో, హత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. తిరుమలరావు అవసరమైన డబ్బు కోసం ఓ బ్యాంకులో రుణం తీసుకున్నట్లు, అలాగే ఆ బ్యాంకులో ఆయన అవకతవకలకు పాల్పడ్డట్టు ప్రచారం ఉంది.

ఐశ్వర్య — పదో తరగతి వరకు చదివినా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే వ్యక్తిగా గుర్తించబడింది. ఆమె తిరుమలరావుతో పాటు మరికొందరితోనూ సంబంధాలు కొనసాగించినట్టు సమాచారం.

ఈ కేసులో తిరుమలరావు భార్యతో పాటు, ఆయన తండ్రి (విశ్రాంత ఏఎస్సై)ని కూడా పోలీసులు స్టేషన్‌కు రప్పించి విచారిస్తున్నారు. గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, విచారణ పురోగతిని సమీక్షించారు. కేసును పూర్తిగా వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా వివరాలు తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News