Hyderabad: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి

Hyderabad: బజార్‌ ఘాట్‌లో చెలరేగిన మంటలు

Update: 2023-11-13 05:38 GMT

Hyderabad: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి

Hyderabad: గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న డీజిల్‌ డ్రమ్ములపైకి టపాసులు దూసుకురావడంతో.. ఒక్కసారిగా డీజిల్ డ్రమ్ముల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా భవనంలోని సెల్లార్‌ మొత్తం అగ్నికి ఆహుతైంది. అగ్నిప్రమాదం విషయం తెలిసేలోపే.. మంటలు పైఅంతస్తులకు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే.. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి మంటలు.. మూడో అంతస్తుకు చేరాయి.

బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌ ‌లో మంటలు చెలరేగిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. భవనం కింది భాగంలో కెమికల్స్‌ నిల్వ చేయడంతో మంటలు ఎగిసి పడ్డాయి. క్షణాల్లో భవనం మొత్తం మంటల్లో చిక్కుకుపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఉదయం 10 గంటల సమయంలో భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బజార్‌ఘాట్‌లో ఉన్న ఐదంతస్తుల భవనంలో 15కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అదే భవనం కింద భాగంలో కెమికల్స్‌ నిల్వ ఉంచారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా భవనాలకు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అందులో నివాసం ఉంటున్న వారిని అప్రమత్తం చేశారు. నిచ్చెనల ఆధారంగా వారిని కిందకు దించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.

అగ్నిప్రమాదం సమయంలో నిద్రలో ఉన్నవారు పొగలో చిక్కుకు పోయి ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆరు బైకులు, కారు కూడా తగులబడ్డాయి. ఐదు ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేసినా అప్పటికే భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. భవనం లోపలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. డీజిల్‌ పొగలు వ్యాపించడంతో లోపల ఉన్న వారు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే.. ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని ఫైర్‌ సిబ్బంది చెప్తుంటే.. భవనం వెలుపల టపాకాయలు కాలుస్తుండగా నిప్పు రవ్వలు చెలరేగి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News