తుఫాన్ ప్రభావం: తెలంగాణలో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు – పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు!

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ కాగా, భద్రతా చర్యగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Update: 2025-10-29 08:06 GMT

ముంథా తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. ఐఎండీ తాజా హెచ్చరికల ప్రకారం, పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ (Flash Floods) వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు:

  • ఆంధ్రప్రదేశ్‌లో: యానం, గుంటూరు, ప్రకాశం తీరప్రాంత జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది.
  • తెలంగాణలో: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
  • మహారాష్ట్రలో: నాందేడ్, హింగోలి, పర్బాణీ, బుల్దానా, అమరావతి, యవత్మాల్, నాగ్‌పూర్ జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ సూచనలు:

  1. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకండి.
  2. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర తిరగవద్దు.
  3. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోండి.
  4. రైతులు పంటలు, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలి.
  5. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి.
  6. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించండి.
  7. IMD, SDMA నుంచి వచ్చే తాజా అప్డేట్స్ తప్పకుండా పాటించండి.

ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జిల్లాలు:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన ప్రకారం,

ఆరెంజ్ అలర్ట్: ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు.

ఎల్లో అలర్ట్: ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు.

విద్యా సంస్థలకు సెలవులు:

భారీ వర్షాల దాటికి నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

రైతుల ఆందోళన:

భారీ వర్షాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి తడిసి నష్టపోతోంది. పత్తి పంటలపై కూడా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం తగ్గే వరకు ప్రభుత్వం పంట రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News