రైతు బంధు డబ్బులు నాలాంటి వాళ్లకు అవసరమా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతుబంధు పథకం పైన కీలకమైన వ్యాఖ్యలను చేసారు.

Update: 2020-03-14 13:33 GMT
KomatiReddy Rajagopal Reddy (file photo)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతుబంధు పథకం పైన కీలకమైన వ్యాఖ్యలను చేసారు. వివిధ శాఖల బడ్జెట్‌ పద్దులను మంత్రులు ప్రవేశపెట్టగా వీటిపై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులకు, నిరుపేదలకు, లబ్దిదారులకు అవసరం అన్నారు. రైతుబంధు ప్రయోజనాలు ధనవంతులకు కాకుండా నిజమైన పేద రైతులకే దక్కాలన్నారు. వాటి ఉపయోగం వారికి ఎంతైనా ఉందన్నారు.

కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న రైతు బంధు పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు అన్నం పెట్టే రైతుకు రైతుబంధు పథకం మంచి కార్యక్రమం అన్నారు. రైతులకు ఎలాంటి సాయం చేసినా మంచిదేఅని ఆయన అన్నారు. మనలో చాలా మంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వుళ్లమే అన్నారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన నిధులలో ప్రతి ఒక్క రూపాయి వ్యవసాయం చేసేవాళ్లకు, పేద రైతులకు దక్కాలనేది తన ఉద్దేశమన్నారు.

కానీ రాష్ట్రంలో ఎంతో మంది పెద్ద రైతులకు, భూస్వాములకు కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులిస్తుందని ఆయన విమర్శించారు. రైతుల ఖాతాలో జమ కావలసిన రైతుబంధు నిధులు తన ఖాతాలో రూ.3లక్షలు జమయ్యాయన్నారు. రైతుబంధు కింద ఇచ్చే నిధులు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా ఖర్చు చేయాలన్నారు. తనలాంటి వాళ్లకు రైతుబంధు డబ్బులు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ము ప్రతిపేద రైతుకు అందాలని ఆయన అన్నారు. అప్పుడే వ్యవసాయం చేసే ప్రతి రైతుకు లాభం చేకూరుతుందన్నారు.

ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె కారణంగా ఎవరు లాభం పొందారిన రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమ్మె కారణంగా సామాన్య ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. చనిపోయిన కార్మికులను తిరిగి తీసుకురాగలరా ? అంటూ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. మధ్యపానానికి యువత భానిసలై ఎంతో మంది తమ భవిష్యత్తులను పాడు చేసుకుంటున్నారన్నారు.

బెల్టు షాపులను పెట్టిన ప్రభుత్వం పేదలకు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటుందని తెలిపారు. కరోనా కంటే బెల్టు షాపులు భయంకరమైన వ్యాధి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెంటనే బెల్ట్‌ షాపులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు కోమటిరెడ్డి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బెల్ట్ షాపులను తొలగించాలని డిమాండ్‌ చేశారు.


Tags:    

Similar News