Sri Ram Sagar Project in Nizamabad: వన్యప్రణులతో సందడిగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరిసరాలు

Update: 2020-07-06 10:23 GMT

Sri Ram Sagar Project in Nizamabad: ఎన్నో ప్రకృతి అందాలకు నెలవు నిజామాబాద్ జిల్లా. గోదావరి నది ఒడ్డున ప్రకృతి పరవశిస్తుంటే పక్షులు, జింకలతో అద్భుత దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కనుచూపు మేర విస్తరించిన పచ్చికబయళ్లు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో విదేశీ పక్షులు, జింక‌లూ కనువిందు చేస్తున్నాయి. శ్రీ రాంసాగర్ ఎగువ భాగం జల సవ్వడితో ఆకట్టుకుంటే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతం వన్య ప్రాణులతో సందడిగా మారింది. గుంపులు గుంపులుగా జింక‌లు గెంతులు వెస్తూ క‌నిపిస్తున్నాయి. స్వేచ్చగా ఎగురుతూ ఆనందంగా ఆడుతున్నాయి.

నిజామాబాద్ - నిర్మల్ జిల్లాల సరిహద్దులుగా ఉన్న శ్రీరాంసాగర్ జలాశయం సుమారు 4వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పరిసర ప్రాంతంలో సంచరిస్తున్న వన్య ప్రాణులకు వేటగాళ్ల రూపంలో కొంత వేటాడే కుక్కల రూపంలో మరికొంత ప్రమాదం పొంచి ఉంది. రాత్రుల్లో వేటగాళ్లు ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నారని గ్రామస్ధులు చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతం 10 వేల ఎకరాలపైనే ఉంటుంది. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా వందల సంఖ్యలో వన్యప్రాణులు, జింకలు, నెమళ్ళు సంచరిస్తుండటంతో వేటగాళ్లు కన్ను వన్యప్రాణులపై పడింది. కుక్కల సహాయంతో జింకలను వేటాడుతున్నట్లు అటవీ అధికారుల దృష్టికి వచ్చింది. వన్య ప్రాణుల రక్షణ కోసం చర్యలు చేపట్టామని అటవీ అధికారులు చెబుతున్నారు. ఏటా ఇదే తరహాలో ఇక్కడ విదేశీ పక్షుల సందడి కనిపిస్తోంది. కొత్త కొత్త జాతుల వింత పక్షులు వలస వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు వీటిని చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్ధులు మాత్రం ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయాలని కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News