Guntakandla Ramachandra Reddy: 95ఏళ్ల వయస్సులో సత్తాచాటిన రామచంద్రారెడ్డి

Guntakandla Ramachandra Reddy: "అదిరిందయ్యా చంద్రం! గెలిచావ్ నాగారం!" – ఈ నినాదం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతోంది.

Update: 2025-12-12 07:16 GMT

Guntakandla Ramachandra Reddy: "అదిరిందయ్యా చంద్రం! గెలిచావ్ నాగారం!" – ఈ నినాదం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతోంది. 95 ఏళ్ళు. మామూలుగా అయితే ఈ వయసులో ఇంటికే పరిమితమై, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ, సూర్యాపేట జిల్లా నాగారం గ్రామానికి చెందిన ఓ పెద్దాయన మాత్రం, యువకుడిలా బరిలో దిగారు. అనుకున్నది సాధించారు. సర్పంచ్‌గా ఘన విజయం సాధించి, రాష్ట్రంలోనే అత్యంత పెద్ద వయసు కలిగిన సర్పంచ్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు.

మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తండ్రి, గుంటకండ్ల రామచంద్రారెడ్డి అలియాస్ నాగారం బాపూ సత్తా చాటారు. సర్పంచ్‌గా ఈయన విజయం కేవలం ఒక ఎన్నికల గెలుపు కాదు, పోరాట స్ఫూర్తికి, గ్రామ అభివృద్ధిపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం.​గ్రామాభివృద్ధి పట్ల ఆయనకున్న ఆరాటం, నిత్యం ప్రజలతో మమేకం కావడం, సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం... ఇవే ఆయన్ను 95 ఏళ్ల వయసులోనూ ఎన్నికల బరిలోకి దింపాయి. గ్రామ ప్రజల ప్రతిపాదన, ఒత్తిడి మేరకు ఈ వయసులోనూ బాధ్యతను భుజాన వేసుకున్నారు.

నాగారంలో ఈసారి సర్పంచ్ ఎన్నిక ఏమంత టగ్ ఆఫ్ వార్ లా సాగలేదు. ఇది పూర్తిగా వన్ సైడ్ వార్! ​రామచంద్రారెడ్డి ఏకంగా 180 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు హవా సాగించినప్పటికీ, నాగారంలో మాత్రం ఆ హవా సాగలేదు. అక్కడ గెలిచింది కేవలం కుటుంబ సేవ, అభివృద్ధి నినాదం మాత్రమే. జగదీష్ రెడ్డి కుటుంబం గ్రామానికి చేసిన సేవలు, పెద్దాయన రామచంద్రారెడ్డిపై ఉన్న అపారమైన గౌరవం, ఆయన విజయాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేకపోయేలా చేశాయి. రాష్ట్రంలో అత్యధిక వయస్సు గల సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అత్యధిక వయస్సులో విజయం సాధించి, మరో రికార్డును బద్దలు కొట్టారు. ఆయన తన పదవీకాలం ముగిసే నాటికి సరిగ్గా వంద ఏళ్లు నిండుతాయి. అంటే, వందేళ్ల వయసులోనూ ప్రజలకు సేవ చేసిన ఏకైక సర్పంచ్‌గా రికార్డు సృష్టించబోతున్నారు.

Tags:    

Similar News