Asteroid 2024 YR4: భూమి సేఫే... కానీ, ఈ అంతరిక్ష శిల చంద్రుడిని ఢీకొంటే?
Asteroid 2024 YR4: ఆస్టరాయిడ్ 2024 వైఆర్4 అనే అంతరిక్ష శిల భూమిని డీకొంటుందా? డీకొంటే ఏమవుతుంది? ఈ ప్రశ్నలతో గత కొన్ని వారాలుగా నాసా శాస్త్రవేత్తలు టెన్షన్ పడ్డారు.
Representative AI Image
Asteroid 2024 YR4: ఆస్టరాయిడ్ 2024 వైఆర్4 అనే అంతరిక్ష శిల భూమిని డీకొంటుందా? డీకొంటే ఏమవుతుంది? ఈ ప్రశ్నలతో గత కొన్ని వారాలుగా నాసా శాస్త్రవేత్తలు టెన్షన్ పడ్డారు. అది 2032లో భూమిని డీకొంటుందని అనుమానించారు. కానీ, రకరకాల లెక్కలు కట్టిన తరువాత నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు అలాంటి రిస్క్ ఏమీ లేదని తేల్చేశాయి. అయితే, భూమికి ఉపగ్రహమైన చంద్రుడికి ప్రమాదం తప్పేలా లేదని మరో కొత్త ఆందోళన మొదలైంది. వైఆర్4 ఆస్టరాయిడ్ చంద్రుడు వైపే వస్తున్నట్లుగా ఉందని వారంటున్నారు.
ఈ ఆస్టరాయిడ్ ఉనికిని తెలుసుకున్నప్పటి నుంచి సైంటిస్టులకు నిద్ర కరవైంది. మొదటి వేసిన అంచనాల ప్రకారం ఈ మహా శిల 2032 డిసెంబర్ 22న భూమిని ఢీకొనే అవకాశం ఉందని, అదే జరిగితే భూమి మీద భారీగా నష్టం ఉంటుందని భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అది తూర్పు పసిఫిక్ సముద్రం, అట్లాంటింక్ సముద్రం, దక్షిణ అమెరికాలో ఉత్తర భాగం వంటి చోట్ల తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుందని భావించారు.
కానీ, తాజా పరిశోధనల ప్రకారం సైంటిస్టులు కొంత రిలాక్సయ్యారు. మొదట 3.1 శాతం రిస్క్ ఉందనుకుంటే, అది ఇప్పుడు 0.001 శాతానికి పడిపోయింది. ఫుట్ బాల్ మైదానం అంత పరిమాణంలో అంటే 131-295 అడుగుల పొడవున్న ఆ ఆస్టరాయిడ్ నుంచి భూమికి ప్రమాదం తప్పినట్లేనని ఊరట చెందుతున్న సమయంలో మరో పిడుగు లాంటి వార్త వినిపిస్తోంది.
ఆస్టరాయిడ్ 2024 వైఆర్4 అంతరిక్ష శిల భూమి మీదకు రావడం లేదు కానీ, అది చంద్రుడిని డీకొట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అది చంద్రుడిని ఢీకొట్టే అవకాసం 1.8 శాతం ఉందని నాసా తెలిపింది. ఈ సంఖ్య రాబోయే వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని స్పేస్ ఏజెన్సీ అంటోంది. అంటే, అది చంద్రుడిని ఢీకొట్టే అవకాశాలు మరింత పెరుగుతాయన్నమాట.
ఒక వేళ సదరు ఆస్టరాయిడ్ నిజంగా చంద్రుడిని డీకొంటే ఏమవుతుంది? చంద్రుడి మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది? చంద్రుడు గతి తప్పితే భూమి మీద వాతావరణం ఎలా మారిపోతుంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు స్పేస్ సైంటిస్టులను వెంటాడుతున్నాయి.