Asteroid 2024 YR4: భూమివైపే దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్... శాస్త్రవేత్తల్లో పెరుగుతున్న టెన్షన్

Asteroid 2024 YR4: ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటుందా? నాసా ఏం చెబుతోంది? 1908 లో భూమి మీదకు దూసుకొచ్చిన ఆస్ట్రాయిడ్‌తో ఏం జరిగింది?

Update: 2025-02-10 12:37 GMT

Asteroid 2024 YR4: ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటుందా? నాసా ఏం చెబుతోంది?

Asteroid 2024 YR4


ఆస్ట్రాయిడ్స్... వీటినే మనం గ్రహశకలాలు అని కూడా పిలుస్తుంటాం. వీటికి ఖగోళ శాస్త్రవేత్తలు పేర్లు కూడా పెడుతుంటారు. ప్రస్తుతం 2024 YR4 అనే ఓ గ్రహశకలం భూమివైపే దూసుకొస్తోందనే వార్త అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇలా గ్రహశకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయనే వార్త ఇవాళ కొత్తేమీ కాకపోయినా... ఈసారి ఈ గ్రహశకలం మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో గ్రహశకలాలు భూమివైపే దూసుకొస్తున్నాయని అనిపించినప్పటికీ అవి భూమికి దగ్గరిగా వచ్చి వెళ్లినవే.

అయితే, ఈ 2024 YR4 అనే ఆస్ట్రాయిడ్ మాత్రం భూమిని ఢీకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా కూడా ఈ ఆస్ట్రాయిడ్‌పై స్పెషల్‌గా ఫోకస్ చేసింది. నాసా ఒక్కటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరున్న స్పేస్ ఏజెన్సీలు ఎన్నో ఈ ఆస్ట్రాయిడ్‌ను ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయి.

Full View

నాసాలో అంతర్గతంగా ఎన్నో అనుబంధ పరిశోధన సంస్థలు ఉన్నాయి. అందులో ఒకటైన సెంటర్ ఫర్ నీయర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ అనే రిసెర్చ్ సంస్థ ఈ ఆస్ట్రాయిడ్‌ను నిశితంగా పరిశీలిస్తోంది. భూమికి దగ్గరిగా వచ్చే గ్రహశకలాలను అధ్యయనం చేయడమే ఈ పరిశోధన సంస్థ పని. గతేడాది డిసెంబర్ 27న ఈ గ్రహశకలాన్ని తొలిసారిగా గుర్తించారు.

అప్పుడు ఈ గ్రహశకలంతో భూమికి అంతగా ముప్పు పొంచి ఉన్నట్లు అనిపించకపోవడంతో అందరూ హమ్మయ్య అని లైట్ తీసుకున్నారు. చాలా గ్రహశకలాల తరహాలోనే ఇది కూడా భూమికి దగ్గరిగా వచ్చి వెళ్లిపోతుందనుకున్నారు. కానీ ఆ తరువాత అడ్వాన్స్ టెక్నాలజీ సాయంతో ఈ ఆస్ట్రాయిడ్‌ను చూసినప్పటి నుంచే ఖగోళ శాస్త్రవేత్తల్లో కొంత టెన్షన్ మొదలైంది. దీంతో అప్పటి నుండి ఈ ఆస్ట్రాయిడ్‌పై సీరియస్‌గా ఫోకస్ చేయడం మొదలుపెట్టారు.

తాజాగా చీలిలోని అట్లాస్ టెలిస్కోప్ నుండి ఈ ఆస్ట్రాయిడ్‌ను చూడగా ఈసారి ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే రిస్క్ ఇంకా డబుల్ అయిందని తేలింది. ఔను.. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశాలు ఇప్పుడు రెండు రెట్లు పెరిగినట్లు కనిపిస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారంతా ఈ గ్రహశకలం కదులుతున్న కక్ష్యపైనే ఓ కన్నేసిపెట్టారు.

ఈ ఆస్ట్రాయిడ్ సైజ్ ఎంత?

ఈ గ్రహ శకలం వ్యాసం 40 మీటర్ల నుండి 100 మీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ఒక పొడవైన అపార్ట్‌మెంట్ సైజ్ ఉంటుందనేది ప్రాథమిక అంచనాగా తెలుస్తోంది. ఇప్పుడు కనిపిస్తున్న సైజ్ ప్రకారం చూస్తే ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటే... దాని ప్రభావం ఆ ప్రాంతం వరకే ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. 1908 లో జరిగిన ఘటనను వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ 1908లో ఏం జరిగింది?

1908 లో భూమి మీదకు దూసుకొచ్చిన ఆస్ట్రాయిడ్

1908 జూన్ 30న ఒక చిన్న ఆస్ట్రాయిడ్ ఇలాగే భూమిమీదకు దూసుకొచ్చింది. రష్యాలోని సైబీరియాలో భూమి వాతావరణంలోకి ప్రవేశించిన ఆ ఆస్ట్రాయిడ్ నేలను తాకడానికి 5 నుండి 10 కీమీ దూరంలో ఉండగానే ఆకాశంలోనే పేలిపోయింది.

ఆ పేలుడు ప్రభావంతో దాదాపు 5 లక్షల ఎకరాల నేల ఒక్కసారిగా ఫ్లాట్ అయిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు... 100 చదరపు కిమీ మేర అడవి కూడా తగలబడిపోయిందని ఆ ఘటన గురించి స్పేస్ రిసెర్చ్ జర్నల్స్‌లో రాశారు. పోడ్కమెన్నాయ తుంగుస్క నదికి సమీపంలో ఈ ఘటన జరిగింది. అందుకే ఈ ఘటనను తుంగుస్క ఈవెంట్ అని పిలుస్తుంటారు.

భూమికి మళ్లీ అలాంటి రిస్క్ పొంచి ఉందా?

2024 YR4 అనే ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశాలు రెండు రెట్లు పెరిగాయని శాస్త్రవేత్తలు అంచనా వేయడంతో భూమికి మరోసారి తుంగుస్క ఈవెంట్ లాంటి ముప్పు పొంచి ఉందా అనే భయం ఖగోళ శాస్త్రవేత్తల్లో కనిపిస్తోంది. అయితే, ఈ ఆస్ట్రాయిడ్‌ను ఇంకొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు లైట్ తీసుకుంటున్నారు.

ఆస్ట్రాయిడ్స్ వేటగాడిగా పేరున్న డేవిడ్ ఏం చెబుతున్నారు?

ఆస్ట్రాయిడ్స్‌ కదలికలను నిశితంగా పరిశీలించే డేవిడ్ రంకిన్ అనే శాస్త్రవేత్త దీని గురించి అప్పుడే అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ ఆస్ట్రాయిడ్‌తో తక్షణమే వచ్చే ముప్పు లేదంటున్నారు. "సాధారణంగా ఆస్ట్రాయిడ్స్ ను మొదటిసారి గుర్తించినప్పుుడు వాటి కదలికలు, సైజ్, కక్ష్య విషయంలో అంతగా స్పష్టత ఉండదు. అందుకే అప్పుడు అవి అంత ప్రమాదకరంగా అనిపించవు. కానీ తర్వాత తర్వాత వాటిపై మరింత స్పష్టత వస్తుంది. ఈ ఆస్ట్రాయిడ్ విషయంలో కూడా అదే జరిగింది. అంతేకానీ కొత్తగా పెరిగిన రిస్క్ అనేదీ ఏమీ లేదు. ఈ ఆస్ట్రాయిడ్ వేగం, గమనం, కక్ష్యను బట్టి మున్ముందు మరింత క్లారిటీ వస్తుంది" అనేది డేవిడ్ అభిప్రాయం. ఏదేమైనా ఈ ఆస్ట్రాయిడ్ ఖగోళ శాస్త్రవేత్తలనే ఆందోళనకు గురిచేస్తోందనే మాట మాత్రం వాస్తవం.

Tags:    

Similar News