World Cup 2025 : 12వ సారి పాక్ మీద తన విజయాన్ని కొనసాగించిన భారత్..88 పరుగుల తేడాతో ఘన విజయం
ఐసీసీ వరల్డ్ కప్ 2025లో భారత మహిళల జట్టు తన విజయ పరంపరను కొనసాగించింది.
World Cup 2025 : 12వ సారి పాక్ మీద తన విజయాన్ని కొనసాగించిన భారత్..88 పరుగుల తేడాతో ఘన విజయం
World Cup 2025 : ఐసీసీ వరల్డ్ కప్ 2025లో భారత మహిళల జట్టు తన విజయ పరంపరను కొనసాగించింది. అక్టోబర్ 5, ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో మెన్ ఇన్ బ్లూ జట్టు ప్రపంచ కప్‌లలో పాకిస్తాన్‌పై తమ 12వ విజయాన్ని నమోదు చేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి టోర్నమెంట్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో, భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. టీమిండియా బ్యాటింగ్ పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ చేయకపోయినా, సమష్టి కృషి వల్ల 50 ఓవర్లలో 247 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత తరఫున అత్యధికంగా హర్లీన్ డియోల్ 65 బంతుల్లో 4 బౌండరీలు, 1 సిక్సర్‌తో 46 పరుగులు చేసింది.
జెమీమా రోడ్రిగ్స్ 32, ప్రతికా రావల్ 31, స్మృతి మంధాన 23, దీప్తి శర్మ 25, స్నేహ రాణా 20 పరుగులు చేశారు. చివర్లో వచ్చిన రిచా ఘోష్ కేవలం 20 బంతుల్లో 3 బౌండరీలు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. పాకిస్తాన్ తరఫున డయానా బేగ్ 4 వికెట్లు తీయగా, సాదియా ఇక్బాల్, కెప్టెన్ ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ మహిళల జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో వికెట్‌కు సిద్రా అమీన్, నటాలియా పర్వేజ్ 69 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి ప్రయత్నించారు. అయితే నటాలియా ఔటైన తర్వాత పాకిస్తాన్ ఇన్నింగ్స్ పూర్తిగా కుప్పకూలింది. సిద్రా అమీన్ 106 బంతుల్లో 9 బౌండరీలు, 1 సిక్సర్‌తో 81 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్ల ధాటికి మిగిలిన బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో పాకిస్తాన్ జట్టు 43 ఓవర్లలో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత తరఫున క్రాంతి గౌడ్ 10 ఓవర్లలో 3 మెయిడెన్లతో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. ఆమెకు తోడుగా దీప్తి శర్మ 3 వికెట్లు, స్నేహ్ రాణా 2 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో పాకిస్తాన్‌పై తమ అజేయ రికార్డును 12-0 కి పెంచుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం కాగా, పాకిస్తాన్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.