VVS Laxman: టీమిండియా హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కాదట.. అందుకు అసలు కారణం ఇదే!
VVS Laxman: భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు తన తల్లి అనారోగ్యం కారణంగా న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో చేరడంతో తిరిగి స్వదేశానికి వచ్చేశారు.
VVS Laxman: టీమిండియా హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కాదట.. అందుకు అసలు కారణం ఇదే!
VVS Laxman: భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు తన తల్లి అనారోగ్యం కారణంగా న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో చేరడంతో తిరిగి స్వదేశానికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని నివేదికలు వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక హెడ్ కోచ్‌గా టీమిండియాకు అటాచ్ చేయవచ్చని పేర్కొన్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. లక్ష్మణ్ ఇంగ్లాండ్‌లో ఉన్నప్పటికీ భారత జట్టు రాబోయే ఇంగ్లాండ్ పర్యటన కోసం అతని గురించి ఎటువంటి అధికారిక నియామకం జరగలేదు. లక్ష్మణ్ ఇంగ్లాండ్‌కు ఏ ఉద్దేశ్యంతో వెళ్లారు అనేది స్పష్టంగా తెలియకపోయినా, అది అతని వ్యక్తిగత పర్యటనకు లేదా క్రికెట్‌కు సంబంధించిన మరేదైనా కార్యకలాపాలకు సంబంధించినట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న లక్ష్మణ్, గతంలో చాలాసార్లు టీమిండియాకు టెంపరరీ కోచ్‌గా పనిచేశారు. అయితే ఈసారి అది కష్టమని భావిస్తున్నారు.
బీసీసీఐకి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, "లక్ష్మణ్ భారత జట్టుతో వేరే ఉద్దేశ్యం మీద ఇంగ్లాండ్‌కు వెళ్లారు. అతను లుసాన్ నుంచి లండన్‌కు వెళ్లారు" అని పేరొన్నారు. మరొక అధికారి, "ఇంగ్లాండ్‌లో విజయం సాధించడమే లక్ష్యం, బహుశా అతను ఇక్కడ ఉన్న కోచ్‌లు, సెలెక్టర్లతో మాట్లాడి ఉండవచ్చు, ఇంట్రా-స్క్వాడ్ గేమ్‌లో కూడా పాల్గొని ఉండవచ్చు. కానీ ఈ జట్టుతో లక్ష్మణ్ కు ఎలాంటి అధికారికపాత్రను అయితే ఇవ్వలేదు" అని పేర్కొన్నాడు.
రెండు జట్ల మధ్య ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్ జూన్ 20న లీడ్స్‌లో జరుగుతుంది. గంభీర్ ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్‌కు తిరిగి రావచ్చు. గంభీర్‌కు సన్నిహితంగా ఉండే ఒక అధికారి క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. "అతను ఖచ్చితంగా మొదటి టెస్ట్‌కు ముందు జట్టుతో చేరతారు. అతను తన తల్లి పరిస్థితి గురించి వైద్యులను సంప్రదించారు. ఆమె పరిస్థితి మెరుగుపడింది. ప్రస్తుతం తను ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. కానీ అతను త్వరలో తిరిగి రావడానికి ప్రణాళిక వేస్తారు" అని చెప్పింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం లేదని, గౌతమ్ గంభీర్ త్వరలోనే తన బాధ్యతలను తిరిగి స్వీకరిస్తారని స్పష్టమవుతోంది.