Wisden Cricketers: విజ్డెన్ దశాబ్దపు ఆటగాడిగా కోహ్లి; కపిల్, సచిన్‌లకూ దక్కిన గౌరవం
Wisden Cricketers: విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. విజ్డెన్ దశాబ్దపు వన్డే క్రికెటర్‌గా ఎంపికయ్యాడు.
విరాట్ కోహ్లీ, సచిన్, కపిల్ దేవ్ (ఫొటో ట్విట్టర్)
Wisden Cricketers: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. విజ్డెన్ దశాబ్దపు (2010- 2020) వన్డే క్రికెటర్‌గా కోహ్లీ ఎంపికయ్యాడు. తొలి అంతర్జాతీయ వన్డే జరిగి 50 ఏళ్లవుతుంది. ఈ నేపథ్యంలో 1971 నుంచి 2021 మధ్య దశాబ్దానికి ఒక్కొక్కరి చొప్పున 5 గురు అత్యుత్తమ క్రికెటర్లను విజ్డెన్ ఎంపిక చేసింది.
2010 దశాబ్దానికి అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ప్రస్తుత టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. 2010 నుంచి పదేళ్ల కాలంలో వన్డేల్లో విరాట్ 60 కి పైగా సగటుతో 11,000 పరుగులు చేశాడు. అందులో 42 సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ దిగ్గజాలు కపిల్‌దేవ్ (1980-90), సచిన్ టెండూల్కర్ (1990- 2000)లకు కూడా ఈ గౌరవం దక్కింది. 1998లో సచిన్ ఏకంగా 9 సెంచరీలు సాధించాడు. టీం ఇండియాకు ప్రపంచకప్ అందించిన కపిల్‌దేవ్ 1980 దశకంలో అందరి కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
1970ల్లో వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్), 2000ల్లో ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు. ఇక ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ వరుసగా రెండో ఏడాది విజ్డెన్ 'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపికయ్యాడు.