Virat Kohli: కింగ్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై?

Virat Kohli: భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పే ఆలోచనలో ఉన్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2025-05-10 06:10 GMT

Virat Kohli: కింగ్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై?

Virat Kohli: భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పే ఆలోచనలో ఉన్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో తన దారిలోనే కోహ్లీ కూడా నడుస్తుండటం భారత క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విరాట్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సెలెక్టర్లకు తెలియజేశాడట. అయితే, సెలెక్టర్లు మాత్రం తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచించారట. మరి కింగ్ కోహ్లీ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

కొద్ది రోజుల క్రితమే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగభరితమైన పోస్ట్ షేర్ చేసిన విషయం తెలిసిందే. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ రోహిత్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని కలచివేసింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ జెర్సీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నాడనే వార్త మరింత కలకలం రేపుతోంది.

రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (IND vs ENG Test Series 2025) కావడం విశేషం.ఈ కీలకమైన సిరీస్‌కు ముందు ఇద్దరు సీనియర్ బ్యాటర్లు టెస్ట్ ఫార్మాట్‌కు దూరమవుతుండడం టీమిండియాకు పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అనూహ్యంగా టీ20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్‌ను వదిలేస్తే, క్రికెట్ అభిమానులు ఈ ఇద్దరు దిగ్గజాలను ఇకపై కేవలం వన్డేలు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రమే చూడగలరు. ఒకప్పుడు 'ROKO' (రోహిత్, కోహ్లీ) జోడీగా ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచిన ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు దూరమవుతుండడం అభిమానులకు తీరని లోటుగా మిగిలిపోనుంది.

విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్

విరాట్ కోహ్లీ తన అద్భుతమైన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 123 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో అతను 46.9 సగటుతో 9230 పరుగులు సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్‌గా ఉంది. టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఖాతాలో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా, అతను 1027 ఫోర్లు, 30 సిక్సర్లు బాదాడు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్, భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఎన్నో విజయాలు అందించాడు. 2014 నుండి 2022 వరకు టెస్ట్ జట్టును నడిపించిన కోహ్లీ సారథ్యంలో భారత్ 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు సాధించింది.

మరి ఇంతటి ఘనమైన టెస్ట్ రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ ఎందుకు ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాడో కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, ఒకేసారి ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు దూరమవుతుండటం భారత జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. సెలెక్టర్లు విరాట్‌ను ఒప్పించడంలో సఫలమవుతారా లేక అభిమానులు ఇకపై టెస్ట్ జెర్సీలో కోహ్లీని చూడలేరా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News