RR vs RCB match: విజృంభించిన విరాట్, సాల్ట్, పడిక్కల్... రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం
RR vs RCB Match Highlights : ఇవాళ జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఐపిఎల్ 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.
ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 47 బంతుల్లో 75 పరుగులు చేసి రాజస్థాన్ స్కోర్ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. స్టేడియం నలువైపులా బౌండరీలు బాదుతూ (10 ఫోర్లు, 2 సిక్సులు) జోష్‌మీదున్న యశస్వి జైశ్వాల్‌ను జోష్ హేజల్‌వుడ్ ఎల్బీడబ్లూ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. సంజూ శాంసన్ 15, రియాన్ పరాగ్ 30, ధృవ్ జురెల్ 35 పరుగులతో జట్టు ఓవర్ ఆల్ స్కోర్‌ను ఇంకొంత ముందుకు తీసుకెళ్లారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజల్‌వుడ్, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ తీశారు.
Comfortable win and that makes it 4️⃣ in 4️⃣ away games! 🙌#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #RRvRCB pic.twitter.com/yKSjpNRShP
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 13, 2025
174 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు మరో 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే 1 వికెట్ నష్టానికే విజయం సాధించింది.
ఫిల్ సాల్ట్ 33 బంతుల్లో 65 పరుగులు (5 ఫోర్లు, 6 సిక్సులు) చేశాడు. కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో సాల్ట్ కొట్టిన షాట్‌ను యశస్వి జైశ్వాల్ క్యాచ్ పట్టడంతో సాల్ట్ వేగానికి కళ్లెం పడింది.
విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో షాట్స్ జోలికి వెళ్లకుండా నెమ్మదిగా ఆడుతూ 45 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దేవ్‌దత్ పడిక్కల్ 28 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు గ్రాండ్ విక్టరీ అందించారు.
బెంగళూరు ఆటగాళ్లను కట్టడి చేయడంలో రాజస్థాన్ బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ చేసిన 75 పరుగులు వృథా అయ్యాయి.
ఐపిఎల్ 2025 పాయింట్స్ పట్టికలో RCB vs RR :
ఈ విజయం తరువాత ఐపిఎల్ 2025 పాయింట్స్ పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 పాయింట్స్, +0.672 నెట్ రన్ రేట్‌తో 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే, 4 పాయింట్స్, +0.838 నెట్ రన్ రేట్‌తో 7వ స్థానంలో ఉంది.