Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రోహిత్ శర్మ అవుట్ ? హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ ?
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రోహిత్ శర్మ అవుట్ ? హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ ?
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. కానీ ఈ టోర్నమెంట్ ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ పెద్ద టెన్షన్ గా మారిపోయింది. రోహిత్ శర్మ గత కొంతకాలంగా పరుగులు సాధించడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. 2024 T20 ప్రపంచ కప్ తర్వాత అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. దీంతో జట్టులో అతని స్థానం గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తను ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో కూడా రోహిత్ ఫెయిల్ అయ్యాడు. ఇంతలో రోహిత్ గురించి ఓ కీలక వార్త వైరల్ అవుతుంది.
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతను ఆస్ట్రేలియా పర్యటనలో కూడా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత అతని రిటైర్మెంట్ వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే, తాను ఆటను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. కానీ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో కూడా తను రాణించలేకపోయాడు. 7 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. ఇదిలా ఉండగా, కొన్ని మీడియా నివేదికలు రోహిత్ శర్మ సిరీస్‌లోని మిగిలిన 2 మ్యాచ్‌లలో విఫలమైతే, అతను స్వయంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి తన పేరును ఉపసంహరించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.
దీని అర్థం ఇంగ్లాండ్ సిరీస్‌లో మిగిలిన 2 మ్యాచ్‌లు రోహిత్ శర్మకు చాలా కీలకమైనవి. ఈ మ్యాచ్‌లలో కూడా రోహిత్ పరుగులు చేయలేకపోతే తను కీలక నిర్ణయం తీసుకోవచ్చు. రోహిత్ ఔట్ అయితే హార్దిక్ పాండ్యా ఈ టోర్నమెంట్‌లో భారత జట్టును సారథ్యం వహించవచ్చని కూడా చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం శుభ్‌మాన్ గిల్ భారత వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీలో ఎక్కువ అనుభవం ఉంది. అతను అనేక పెద్ద సందర్భాలలో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు.
2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ మొత్తం 8 టెస్ట్ మ్యాచ్‌లు, 4 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో అతను టెస్ట్‌లలో 10.93 సగటుతో కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉంది. మరోవైపు, వన్డేల్లో అతను 39.75 సగటుతో 159 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ అతను ఈ రెండు అర్ధ సెంచరీలను 2024 T20 ప్రపంచ కప్ తర్వాత శ్రీలంక పర్యటనలో ఆడిన వన్డే సిరీస్‌లో సాధించాడు. గత 10 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో తను కేవలం 3 సార్లు మాత్రమే రెండంకెల మార్కును తాకగలిగాడు. ఇది టీం ఇండియాకు ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పుకోవాలి.