Team India Squad: గంభీర్, రోహిత్ మధ్య విభేదాలు నిజమేనా? జట్టు ఎంపికలో తేడాలొచ్చాయా?
గంభీర్, రోహిత్ మధ్య విభేదాలు నిజమేనా?
Champions Trophy 2025: ఆస్ట్రేలియా పర్యటన నుండి కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య మంచి సమన్వయం లేదని పుకార్లు వ్యాపించాయి. ఇప్పుడు మరోసారి రోహిత్, గంభీర్ మధ్య గొడవ వార్తలు తెరపైకి వస్తున్నాయి. శనివారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం జట్టు భారత జట్టును ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు జట్టును ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరు ఆటగాళ్లకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ముంబైలో సుదీర్ఘ సమావేశం జరిగింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతన్ని వైస్ కెప్టెన్‌గా నియమించింది. అయితే, గిల్‌ను వైస్ కెప్టెన్‌గా చేయడానికి గౌతమ్ గంభీర్ అనుకూలంగా లేడని దైనిక్ జాగరన్ వార్తా కథనం పేర్కొంది.
గంభీర్ హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా చేయాలనుకున్నాడా?
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను వన్డే వైస్ కెప్టెన్‌గా నియమించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ అతనికి కెప్టెన్, సెలెక్టర్ల సపోర్ట్ దొరకలేదు. రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశం తర్వాత రోహిత్-అగార్కర్ చివరకు తమకు నచ్చినట్లుగానే వ్యవహరించారని.. శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారని ఆ కథనం పేర్కొంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో హార్దిక్ పాండ్యా జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయినప్పుడు, కెప్టెన్సీని హార్దిక్ కు అప్పగిస్తారని అనిపించింది. కానీ అది జరగలేదు. ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్ టీం ఇండియా టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
గంభీర్ కూడా సామ్సన్‌ను జట్టులో ఉంచాలని అనుకున్నాడా?
ఛాంపియన్స్ ట్రోఫీకి సంజు సామ్సన్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేయాలని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోరుకున్నారని తెలుస్తోంది. కానీ రోహిత్, అగార్కర్ ఎంపిక రిషబ్ పంత్ అని, అందుకే సంజును విస్మరించారని కూడా ఆ నివేదిక పేర్కొంది. గత సంవత్సరం సంజు సామ్సన్ ఓపెనర్‌గా ఆడుతూ, భారతదేశం తరపున వరుసగా రెండు సెంచరీలు సాధించడం ద్వారా సంచలనం సృష్టించాడు. తరువాత అతను మాట్లాడుతూ.. కోచ్ గంభీర్ తనకు చాలా సహాయం చేశాడని, అతనిపై నమ్మకం పెట్టుకున్నారని చెబుతున్నారు. అంతకుముందు, T20 ప్రపంచ కప్‌లో సామ్సన్ కూడా జట్టులో భాగమయ్యాడు. కానీ అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ , యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ , యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా.