IPL 2025: ముంబై విధ్వంసం.. 100 పరుగుల తేడాతో రాజస్థాన్ చిత్తు
IPL 2025: ముంబై ఇండియన్స్‌ను ఇప్పుడు ఆపడం కష్టమే కాదు.. అసాధ్యంగా కనిపిస్తోంది.
IPL 2025: ముంబై విధ్వంసం.. 100 పరుగుల తేడాతో రాజస్థాన్ చిత్తు
IPL 2025 :ముంబై ఇండియన్స్‌ను ఇప్పుడు ఆపడం కష్టమే కాదు.. అసాధ్యంగా కనిపిస్తోంది. సీజన్ ఆరంభంలో వరుసగా ఓటములతో తీవ్రంగా ఇబ్బంది పడిన ఈ జట్టు, ఇప్పుడు వరుసగా ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 217 పరుగులు చేయగా, రాజస్థాన్ జట్టు లక్ష్యాన్ని ఛేదించకపోగా, 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ముంబై బ్యాటింగ్ విధ్వంసం తర్వాత బౌలింగ్ యూనిట్ కూడా రాజస్థాన్ రాయల్స్‌ను కుప్పకూల్చింది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడిపోయినప్పటికీ, ఆటలోని ప్రతి విభాగంలోనూ ఆ జట్టును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్, రికల్టన్ మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రికల్టన్ కేవలం 38 బంతుల్లో 61 పరుగులు చేయగా, రోహిత్ 36 బంతుల్లో 53 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ 23 బంతుల్లో 48 పరుగులు చొప్పున చేసి జట్టు స్కోరును భారీగా పెంచారు.
గుజరాత్ టైటాన్స్‌పై చేసిన విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శనను ముంబై ఇండియన్స్‌పై కూడా పునరావృతం చేస్తుందని రాజస్థాన్ రాయల్స్ ఆశించింది. కానీ బోల్ట్, బుమ్రా వారి ఆశలను అడియాసలు చేశారు. దీపక్ చాహర్ మొదట వైభవ్ సూర్యవంశీని డకౌట్ చేయగా, ఆ తర్వాత బోల్ట్ యశస్వి జైస్వాల్, నితీష్ రాణాలను పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా రంగంలోకి దిగి రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను అవుట్ చేశాడు. తర్వాతి బంతికే షిమ్రాన్ హెట్‌మెయర్ కూడా వెనుదిరిగాడు.
పవర్‌ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా వారి కష్టాలు తీరలేదు. హార్దిక్ పాండ్యా శుభమ్ దూబేను అవుట్ చేయడంతో రాజస్థాన్ ఆఖరి ఆశ కూడా ఆవిరైపోయింది. లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ తన మాయాజాలంతో మిగిలిన పని పూర్తి చేశాడు. అతను ధ్రువ్ జురెల్‌ను 11 పరుగులకే పెవిలియన్ చేర్చడంతో పాటు మహిష్ తీక్షణ, కుమార్ కార్తికేయ వికెట్లను కూడా తీశాడు. చివర్లో బోల్ట్ ఆర్చర్‌ను అవుట్ చేయడంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ 117 పరుగులకే ముగిసింది. ఈ ఘోర ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 టోర్నీ నుండి నిష్క్రమించింది. మరోవైపు ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు మరింత చేరువైంది.