Kevin Pietersen: ఇండియాను చూస్తుంటే.. హృదయం ముక్కలవుతోంది!

Kevin Pietersen: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారత్‌ను వదిలిపెట్టి వచ్చాననే కానీ, నా మనసంతా అక్కడే ఉందంటూ ట్వీట్ చేశాడు.

Update: 2021-05-11 10:24 GMT
కెవిన్ పీటర్సన్ (ఫొటో ట్విట్టర్)

Kevin Pietersen: కరోనా సెకండ్ వేవ్ తో ఇండియాలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ హిందీలో ట్విట్ చేస్తూ.. భారత్‌ను వదిలిపెట్టి వచ్చాననే కానీ, నా మనసంతా అక్కడే ఉందంటూ ఉద్వేగంతో రాసుకొచ్చాడు. కోవిడ్ కష్ట సమయాన్ని భారత్ ప్రజలంతా ఎంతో ధైర్యంతో ఎదుర్కోవాలని అన్నాడు. దయచేసి అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఇళ్ల వద్దే ఉండాలని కోరాడు.

కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం పీటర్సన్‌ ఇండియాకు వచ్చాడు. ఐపీఎల్ లో పలు మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా పనిచేశాడు. ఆటగాళ్లకు కోవిడ్ సోకడంతో టోర్నీ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు స్వదేశానికి తెరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే భారత్‌లో కోవిడ్ పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. ట్విటర్‌ లో సంఘీభావం ప్రకటించాడు.

''నేనెంతగానో ప్రేమించే భారత్‌ను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే గుండె ముక్కలవుతోంది. కరోనా సంక్షోభం నుంచి బయటపడగల సత్తా భారత్‌కు ఉంది. కరుణ, ప్రే​మ కురిపించే దేశాన్ని ఈ కరోనా మహమ్మారి ఏమీ చేయలేదు. ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా'' అని పీటర్సన్‌ ఇండియాపై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు.

ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ లో నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. ఇక ఇండియాలో కరోనా కేసుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో.. 3లక్షల29వేల942 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న(సోమవారం) ఒక్కరోజే 3876 మరణాలు సంభవించినట్లు పేర్కొంది.


Tags:    

Similar News